Asia Cup: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సి ఉన్న ఆసియా కప్ - 2023 ఎక్కడ జరుగుతుంది..? అసలు ఈ టోర్నీ ఉంటుందా..? ఉండదా..? బీసీసీఐ, ఐసీసీ ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గుతుందా..? ఒకవేళ తమదేశంలో కాకుంటే ఇతర దేశాల్లో నిర్వహిస్తే పాక్ ఈ టోర్నీలో ఆడుతుందా..? అన్న అనుమానాలు, సమాధానాలు తేలని ప్రశ్నల మధ్య ఊగిసలాడుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన చిరకాల మిత్రుడిగా ఉన్న శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ)పై అలిగింది. ఆసియా కప్ నిర్వహణ వివాదంలో తమకు మద్దతుగా నిలుస్తారనుకుంటే.. ఆ టోర్నీని తమ దేశంలో నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతుండటంతో పీసీబీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.
పీసీబీ చీఫ్ నజమ్ సేథీ సూచించిన హైబ్రిడ్ మోడల్ (భారత్‌తో మ్యాచ్‌లు తటస్థ వేదికపై)కు బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) లోని సభ్య దేశాలు కూడా ససేమిరా అనడంతో పాటు ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది పాకిస్తాన్‌కు మింగుడుపడటం లేదు. దీంతో పీసీబీ.. లంక బోర్డు తీరుపై అసంతృప్తిగా ఉండటమే గాక జులైలో పాకిస్తాన్ జట్టు లంక పర్యటనను కూడా బహిష్కరించనుందని పీసీబీ వర్గాలు తెలిపాయి.
ఇదే విషయమై పీసీబీ ప్రతినిధి ఒకరు పీటీఐతో స్పందిస్తూ... ‘సెప్టెంబర్‌లో జరుగబోయే ఆసియా కప్‌ను స్వదేశంలో నిర్వహించడం పాకిస్తాన్ వంతు అయినప్పుడు శ్రీలంక బోర్డు ఆతిథ్యమిచ్చేందుకు ముందుకు రావడంపై పీసీబీ సంతోషంగా లేదు. ఈ విషయంలో పీసీబీ చీఫ్ నజమ్ సేథీ కూడా లంక బోర్డు తీరుపై నిరాశచెందారు. శ్రీలంకకు పాకిస్తాన్ బోర్డుతో చాలాకాలంగా సత్సంబంధాలున్నాయి. అలాంటి లంక.. ఆసియా కప్ నిర్వహణలో ఇతర సభ్యదేశాలను ఒప్పించి మాకు మద్దతుగా నిలుస్తుందనుకుంటే.. తమ దేశంలోనే టోర్నీని నిర్వహించాలని భావించడంపై సేథీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే ఐపీఎల్ - 16 ఫైనల్ లో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ బోర్డుల అధ్యక్షులు ఏసీసీ అధ్యక్షుడు జై షాను కలిసి చర్చించడంపై కూడా సేథీ నిరాశ చెందాడు..’ అని తెలిపాడు.
లంక బోర్డు ఇచ్చిన షాక్‌తో పాక్ కూడా అప్రమత్తమైంది. ఈ విషయంలో తమకు మద్దతుగా లేకున్నా ఫర్వాలేదు గానీ ఇలాంటి (ఆసియా కప్ ను తమ దేశంలో నిర్వహించాలని చూడటం) చర్యలకు పాల్పడితే మాత్రం వచ్చేనెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సిన విషయంలో తాము పునరాలోచించుకోవాల్సి ఉంటుందని పీసీబీ హెచ్చరిస్తున్నది. జులైలో పాక్.. లంకలో రెండు టెస్టులు ఆడాల్సి ఉండగా.. వీటితో పాటు మూడు వన్డేలు కూడా ఆడాల్సిందిగా ఎస్ఎల్‌సీ ప్రతిపాదించింది. కానీ ఈ ప్రతిపాదనను పీసీబీ తిరస్కరించనున్నట్టు తెలుస్తున్నది.