Ruturaj Gaikwad Wedding: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్  ఓ ఇంటివాడయ్యాడు. పూణెకు చెందిన ఉత్కర్ష అమర్ పవార్‌తో  గైక్వాడ్ జట్టుకట్టాడు.  జూన్ 3 (శనివారం) రాత్రి మహాబలేశ్వర్‌లో రుతురాజ్ వివాహం ఘనంగా జరిగింది.  ఈ విషయాన్ని స్వయంగా  రుతురాజ్ తన సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలు షేర్ చేసి వెల్లడించాడు.  కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట  ఒక్కటైంది.  


ఇన్‌స్టాగ్రామ్‌లో రుతురాజ్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘పిచ్ నుంచి హోమగుండం వరకూ.. మా ప్రయాణం  మొదలైంది..’ అని రాసుకొచ్చాడు.  రుతురాజ్ మాదిరిగానే  ఉత్కర్ష కూడా  క్రికెటరే. ఆమె మహారాష్ట్ర మహిళా జట్టుకు  ప్రాతినిథ్యం వహించింది. 


ఎవరీ ఉత్కర్ష పవార్..? 


ఉత్కర్ష అమర్ పవార్‌ స్వస్థలం కూడా  మహారాష్ట్రలోని పూణె (రుతురాజ్ కూడా ఇక్కడివాడే). 24 ఏండ్ల ఉత్కర్ష..  మహారాష్ట్ర  తరఫున ఆడింది. రుతురాజ్  బ్యాటింగ్‌కే పరిమితం కాగా  ఉత్కర్ష మాత్రం ఆల్  రౌండర్. అయితే గడిచిన రెండేండ్లుగా ఆమె  క్రికెట్ ఆడలేదు.  ప్రస్తుతం పూణెలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్, ఫిట్‌నెస్ సైన్స్ (ఐఎన్ఎఫ్ఎస్) లో చదువుకుంటున్నది.  2021  నవంబర్‌లో మహారాష్ట్ర తరఫున ఆఖరి మ్యాచ్ ఆడిన ఉత్కర్ష.. రుతురాజ్‌తో రెండేండ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు  సమాచారం. 


 






ఐపీఎల్ - 16 టైటిల్ గెలిచిన తర్వాత రుతురాజ్.. ఉత్కర్షతో కలిసి ఫోటోలు దిగాడు.  ట్రోఫీ గెలిచాక ఉత్కర్ష ధోని  కాళ్లు మొక్కి అతడి ఆశీర్వాదం తీసుకున్న వీడియో  నెట్టింట వైరల్ అయింది. ఆ తర్వాత రుతురాజ్ కూడా ఐపీఎల్ ట్రోఫీతో  ధోని, ఉత్కర్షలతో కలిసి ఉన్న ఫోటోను  తన ఇన్‌స్టాలో పంచుకుంటూ ‘నా లైఫ్ లో ఇద్దరూ వీవీఐపీలు’ అని చేసిన పోస్టు కూడా వైరల్ గా మారింది. 


 






డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడేందుకు గాను రుతురాజ్ కు అవకాశం (స్టాండ్ బై ప్లేయర్‌గా)  వచ్చింది. కానీ  వివాహం కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.  సీఎస్కేలో తన సహచర ఆటగాడు శివమ్ దూబే తన కుటుంబంతో కలిసి రుతురాజ్ వివాహానికి హాజరయ్యాడు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్‌లు రుతురాజ్‌కు శుభాకాంక్షలు  తెలిపారు.


2020లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రుతురాజ్.. అప్పట్నుంచీ  చెన్నై టీమ్‌తోనే ఆడుతున్నాడు.  2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.  ఆ సీజన్‌ల 16 మ్యాచ్‌లు ఆడి 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు.  ఇటీవలే ముగిసిన సీజన్‌లో కూడా  16 మ్యాచ్‌లు ఆడి 590 రన్స్ సాధించాడు.