ప్రపంచకప్‌లో వరుస ఓటములతో దాయాది దేశం పాకిస్థాన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. హ్యాట్రిక్‌ ఓటములతో మహా సంగ్రామంలో ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిన స్ధితికి చేరుకుంది. అప్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో పాక్‌ జట్టు ఆటతీరును మాజీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సారధి బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్సీని కొందరు మాజీలు ప్రశ్నిస్తున్నారు. సర్వత్రా విమర్శల జడివాన కురుస్తున్న వేళ... వరుస ఓటములపై పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ స్పందించాడు. ప్రపంచకప్‌లో తమ ద్వారాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని.. ఆజామ్‌ స్పష్టం చేశాడు. క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చని.. కానీ తాము చివరి వరకు అత్యుత్తమ క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించాడు. తమకు ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని... అన్ని మ్యాచ్‌లు గెలిచేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామని బాబర్‌ తెలిపాడు. ప్రపంచకప్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచి ముందుకు సాగుతామని వివరించాడు. తమ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. 



 కెప్టెన్సీ ఒత్తిడి మీ బ్యాటింగ్ ప్రదర్శనను ప్రభావితం చేస్తుందా అన్న ప్రశ్నకు కూడా బాబర్‌ స్పందించాడు.  తనపై కానీ తన బ్యాటింగ్‌పై కానీ కెప్టెన్సీ ఒత్తిడి అస్సలు లేదని తేల్చి చెప్పాడు. తాను వంద శాతం కెప్టెన్సీని సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నానని.. ఇప్పుడు అదే చేస్తున్నానని బాబర్‌ అన్నాడు. తాము ఫీల్డింగ్ చేసేటప్పుడు కెప్టెన్సీ గురించి మాత్రమే ఆలోచిస్తానని.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు కోసం ఎలా పరుగులు చేయాలనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.మీ ఓటముతో దేశం మొత్తం విచారంలో మునిగిపోయిందని... వారికి ఏం సమాధానం చెప్తారన్న ప్రశ్నకు బాబర్‌ స్పందించాడు. వచ్చే మ్యాచుల్లో విజయం కోసం శక్తివంతన లేకుండా ప్రయత్నిస్తామని తెలిపాడు. 



 భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాక్‌ పీకల మీదకు తెచ్చింది. ఆడిన అయిదు మ్యాచుల్లో తొలి రెండు మ్యాచులను గెలిచిన పాకిస్థాన్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. భారత్‌, ఆస్ట్రేలియా, అఫ్గాన్‌ చేతుల్లో భంగపాటుకు గురైన పాక్‌... ఇప్పుడు సెమీస్‌ చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. హ్యాట్రిక్ ఓటమితో పాక్‌ సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్‌ 4లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక్క మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయినా పాక్‌ ఆశలు గల్లంతే. ఇప్పటికీ సెమీఫైనల్‌ చేరుకోవడానికి పాక్‌కు అవకాశమైతే ఉంది. కానీ ఈ అవకాశం చాలా క్లిష్టంగా ఉంది.



 ఈ ప్రపంచకప్‌లో పాక్ నిలవాలంటే ఇక ఓటమి, వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు అనే మాటే ఉండకూడదు. 2019లోనూ పాక్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2019 ప్రపంచకప్‌లో మెరుగైన రన్‌రేట్‌ కారణంగా న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరింది. ఇప్పుడు కూడా పాక్‌ అదే స్థితిలో ఉంది. వర్షం పడకుండా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల ఫలితాలు రావాలి. ఆ నాలుగు మ్యాచుల్లోనూ పాక్‌ కచ్చితంగా గెలవాలి. చెన్నైలో దక్షిణాఫ్రికాతో, కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో, బెంగళూరులో న్యూజిలాండ్‌తో కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో పాక్‌ తలపడాల్సి ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ మ్యాచుల్లో పాక్‌కు కఠిన సవాల్‌ ఎదురు కావచ్చు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి ఎదురైనా ఈ మహా సంగ్రామంలో పాక్‌ కథ ముగిసినట్లే.