Pakistan Women Cricketers accident : పాకిస్థాన్ ఉమెన్ క్రికెటర్లు(Pakistan Women Cricketers) శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్(Bismah Maroof), లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమా(Ghulam Fatima) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాయ్యాయి. ప్రమాదం ఏప్రిల్ 5 శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించామని, తదుపరి చికిత్స నిమిత్తం వారిని బోర్డు వైద్య బృందం సంరక్షణలో ఉంచామని పీసీబీ(PCB) ఒక ప్రకటనలో తెలిపింది. వారికి కావాల్సిన పూర్తి వైద్యసేవలను అందిస్తామని కూడా పాక్ బోర్డు ప్రకటించింది.
మరూఫ్, ఫాతిమా ఇద్దరూ త్వరలో పాకిస్తాన్ కు వెస్టిండీస్ మహిళలతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కోసం శిక్షణా శిబిరంలో భాగంగా ఉన్నారు. ఇద్దరూ పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్నారు. ఈ ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఏప్రిల్ 18 న ప్రారంభం కానుంది, మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి. మరి ఈ సిరీస్‌కు ఈ ఇద్దరు క్రికెటర్లు అందుబాటులో ఉంటారా లేదా అన్నది వారు కోలుకున్నాకా.. మెడికల్ టీమ్ నిర్ణయించనుంది.
బిస్మా మరూఫ్ అంతర్జాతీయ కెరీర్ ఇప్పటివరకు అద్భుతంగా ఉంది. ఆమె 133 వన్డే మ్యాచ్‌లు ఆడారు. మొత్తం 3278 పరుగులు చేశారు. వన్డే మ్యాచ్ ఫార్మాట్‌లో ఆమె 20 అర్ధ సెంచరీలు చేసింది. బౌలింగ్‌లోనూ బిస్మా అద్భుతంగా రాణించారు . ఇప్పటివరకు 44 వికెట్లు తీశాడు. మొత్తం 140 టీ20 మ్యాచ్‌లు ఆడి 2893 పరుగులు చేసింది. అదే సమయంలో 36 వికెట్లు కూడా తీశారు. ఇక గులాం ఫాతిమా కెరీర్‌ను పరిశీలిస్తే.. 15 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టింది. 5 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆమె 2 వికెట్లు పడగొట్టింది.
పురుషుల జట్టుకు ఆర్మీ ట్రైనింగ్:
పాకిస్థాన్ క్రికెటర్ల ఫిట్‌నెస్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2024 సీజన్ ముగిసిన వెంటనే జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంతో కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. సైన్యంలో శిక్షణతో ఆటగాళ్ల ఫిట్‌నెస్ మెరుగుపడుతుందని భావించిన పాక్ క్రికెట్ బోర్డు... పాక్ క్రికెటర్లకు సైనికుల నేతృత్వంలో కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపింది. కెప్టెన్ బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణకు పంపింది. సైనిక శిక్షణ వల్ల పాక క్రికెటర్ల ఫిట్నెస్ మరింత మెరుగుపడుతుందని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఆటగాళ్ల సైనిక శిక్షణకు సంబంధించిన వీడియోను కూడా పాక్ క్రికెటర్ బోర్డు విడుదల చేసింది. ప్రస్తుతం వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ క్యాంప్‌లో కసరత్తులు చేస్తున్నారు. వీరికి ఫిట్‌నెస్‌ను పెంచే వ్యాయామాలతో పాటు సైనికుల తరహాలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. బాబర్ అజామ్, రిజ్వాన్‌తో పాటు దాదాపు 30 మంది ఆటగాళ్లు దీనిలో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.