భారత్‌పై ఓటమితో సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్థాన్ జట్టును మరో సమస్య వెంటాడుతోంది. ప్రపంచకప్‌లో కీలకమైన నాలుగో మ్యాచ్‌ కోసం పాకిస్థాన్ క్రికెట్‌ జట్టు బెంగళూరుకు చేరుకుంది. అయితే జట్టు బెంగళూరు చేరుకోగానే చాలామంది ఆటగాళ్లు వైరల్ ఫీవర్‌ బారినపడ్డట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్‌ 20న ఆస్ట్రేలియా చేతిలో కీలకమైన మ్యాచ్‌ జరగనున్న వేళ చాలామంది ఆటగాళ్లు వైరల్‌ ఫీవర్‌ బారినపడడంతో దాయాది జట్టులో తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా ఈ వార్తలపై  పాకిస్థాన్ జట్టు మీడియా మేనేజర్ స్పందించారు. ఆటగాళ్ల వైరల్ ఫీవర్‌పై తాజా అప్‌డేట్ ఇచ్చారు.

 

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న చాలా మంది పాకిస్థానీ ఆటగాళ్లు కోలుకున్నారని, అయితే కొంతమంది ఆటగాళ్లు ఇంకా వైద్యుల పరిశీలనలో ఉన్నారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీడియా మేనేజర్ ఎహ్సాన్ ఇఫ్తికర్ తెలిపారు. బెంగళూరులో కొన్ని నెలలుగా వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. మారుతున్న వాతావరణం వల్ల వైరల్‌ ఫీవర్లు నమోదు అవుతున్నాయని వైద్యులు తెలిపారు. బెంగళూరు చేరుకోగానే పాకిస్థానీ ఆటగాళ్లకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఎహ్సాన్‌ వెల్లడించారు. పాకిస్థాన్ జట్టులో కొంతమంది ఆటగాళ్లు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని, అయితే వారిలో ఎక్కువ మంది దాని కోలుకున్నారని చెప్పారు. కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ వైద్యుల పరిశీలనలో ఉన్నారని, కెప్టెన్ బాబర్ ఆజం, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన ధృవీకరించారు. పాకిస్థాన్ జట్టు చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ కూడా చేసిందని వివరించారు.
  

 

ప్రపంచకప్‌ ప్రయాణం ఇలా...

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌ జట్టు రెండు విజయాలు నమోదు చేసింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో బాబర్ సేన నెదర్లాండ్స్‌ను ఓడించింది. శ్రీలంకపై చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో అతిపెద్ద లక్ష్యాన్ని పాక్‌ ఛేదించింది. ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌.. కనీసం 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ప్రారంభ దశలో పటిష్ట స్థితిలో నిలిచిన పాక్..తరువాత రాను రాను ఒత్తిడికి చిత్తయి వికెట్లు సమర్పించుకుంది. కేవలం 36 పరుగులు మాత్రమే జోడించి చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు బ్యాటర్లలో బాబర్ ఆజమ్‌ ఒక్కడే హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఐదుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో 42.5 ఓవర్లలో పాకిస్థాన్‌ 191 పరుగులకు ఆలౌట్‌ అయింది.

 

టీమిండియా బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం స్వల్వ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు.. పాకిస్థాన్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. వచ్చీరాగానే 4 ఫోర్లు కొట్టి.. ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ ఆ ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. విరాట్‌ కోహ్లీ (16) సైతం త్వరగానే ఔట్‌ అయ్యాడు. కెప్టెన్ రోహిత్‌ శర్మ (86) మరోసారి చెలరేగిపోవడంతో పాకిస్థాన్‌ నిర్దేశించిన 192 స్వల్ప పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే ఛేదించింది.

 

పాకిస్థాన్ జట్టు

బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అగా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వస్రిది.