ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో ఎదురైన ఘోర పరాజయం నుంచి పాక్‌ ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌ బయటకు రాలేకపోతుంది. ఇప్పటికే అహ్మదాబాద్‌లో అభిమానుల తీరుపై పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ మిక్కీ అర్థర్‌ విషం చిమ్మగా తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు రంగంలోకి దిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అభిమానుల ప్రవర్తనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి ఫిర్యాదు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. స్టేడియంలో ఉన్న అభిమానులు పాక్ ఆటగాళ్లపై ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. పాకిస్తాన్ జర్నలిస్టులకు వీసాల జాప్యంపై కూడా ఐసీసీకి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్టు ఫిర్యాదు చేసింది. 2023 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ అభిమానులకు వీసా విధానం లేకపోవడంపై ఐసీసీ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక నిరసన తెలిపినట్లు ట్వీట్‌ చేసింది.

 

అహ్మదాబాద్‌లో అసలేం జరిగింది.

భారత్‌-పాక్‌ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌ మైదానంలో క్రికెట్‌ అభిమానులు చేసిన జై శ్రీరాం నినాదాలపై వివాదం నెలకొంది. పాక్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌ అవుటై పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు జై శ్రీరాం నినాదాలు వినపడ్డాయి. దీనిపై సోషల్‌ మీడియాలో భారత క్రికెట్‌ అభిమానులు ఇస్లామోఫోభియాతో బాధపడుతున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై భారత క్రికెట్‌ అభిమానులు కూడా దీటుగా బదులిస్తున్నారు. ఆరంభ పోరులో పాకిస్తాన్ జట్టు హైదరాబాద్‌లో శ్రీలంకతో తలపడినప్పుడు పాక్‌ జట్టుకు హైదరాబాదీ ప్రేక్షకులు మద్దతు పలికిన విషయాన్ని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి పాక్‌ జట్టు అహ్మదాబాద్‌ వచ్చినప్పుడు వారికి ఘన స్వాగతం లభించిన వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఇదీ భారత అభిమానం అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా భారత అభిమానులు ఆదిపురుష్‌ చిత్రంలో జై శ్రీరామ్‌ పాట వచ్చినప్పుడు గొంతు కలిపారని... అలా ఆ ఒక్కపాటకే కాదని మ్యాచ్‌ సందర్భంగా ప్లే చేసిన ప్రతీ పాటకు అభిమానులు గొంతు కలిపి సందడి చేశారని వీడియోలను సాక్ష్యంగా పోస్ట్‌ చేస్తూ విమర్శలకు గట్టిగా బదులిస్తున్నారు.

ఆర్థర్‌ ఏమన్నాడు.

 

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు డైరెక్టర్ మిక్కీ అర్థర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తోంది. దాయాదుల పోరు ముగిసిన తర్వాత ఇది ప్రపంచకప్‌లా లేదు బీసీసీఐ ఈవెంట్‌లా ఉందని అర్థర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌ జట్టు మాజీ క్రికెటర్లు, భారత క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. అర్థర్‌ వ్యాఖ్యలు కలకలం రేపుతున్న వేళ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ICC స్పందించింది. ఆర్థర్‌ వ్యాఖ్యాలను చాలా తేలిగ్గా తీసుకుంది. తాము నిర్వహించే ప్రతి టోర్నమెంట్‌లో ఇలాంటి విమర్శలు సహజమేనని ICC ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు. వివిధ వర్గాల నుంచి ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయని ICC ఛైర్మన్‌ అన్నారు. 

 

టీమిండియా రికార్డు విజయం

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ ఎనిమిదోసారి విజయం సాధించింది. పాక్‌ జట్టు విధించిన 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా ఛేదించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై వరుసగా ఎనిమిదోసారి విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును పాక్ జట్టు ఎన్నడూ ఓడించలేకపోయింది.