PAK vs SL, Asia Cup 2023: మిగతా టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌ల సంగతి ఎలా ఉన్నా ఆసియా కప్ అంటేనే తమలోని అత్యుత్తమ ఆట ఆడే  శ్రీలంక.. తమకు ఈ టోర్నీ అంటే ఎందుకంత క్రేజో మరోసారి నిరూపించింది. జట్టులో కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడ్డా, టోర్నీ ఆరంభానికి ముందే జట్టులో కోవిడ్ కలకలం రేగినా..  ఉన్న వనరులతోనే ఆ జట్టు 12వ సారి ఆసియా కప్‌లో ఫైనల్‌ (11 వన్డే, ఒక టీ20)కు చేరింది. అసలు ఈ జట్టుతో సూపర్ - 4 చేరడమే గొప్ప అని భావించిన విమర్శకులకు తమ ఆటతోనే సమాధానమిచ్చింది.  గురువారం రాత్రి కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో ముగిసిన సూపర్ - 4 మ్యాచ్‌లో  లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో బాబర్ గ్యాంగ్‌ను ఓడించి  పాక్‌ను టోర్నీ నుంచి పంపించింది. అద్భుత విజయంతో  వచ్చే ఆదివారం భారత్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయింది. 


స్టార్ బౌలర్లు కున్నా.. 


వనిందు హసరంగ,  దుష్మంత చమీర, దిల్షాన్ మధుశంక , లాహిరు  కుమార.. లం బౌలింగ్‌కు  వెన్నెముక వీళ్లు.  ముగ్గురు ప్రధాన పేసర్లతో పాటు  స్టార్ స్పిన్నర్ హసరంగ కూడా   గాయాల కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో లంక  ఉన్న వనరులతోనే  నెట్టుకొచ్చింది.  బౌలింగ్‌‌లో అంతగా అనుభవం లేని జట్టుతోనే అద్భుతాలు చేసింది.  కసున్ రజితతో పాటు  యువ సంచలనం మతీశ పతిరాన పేస్ బాధ్యతలు మోశారు. కెప్టెన్ దసున్ శనక వారికి తోడ్పాటు అందించాడు. ఇక స్పిన్ విభాగాన్ని మహీశ్ తీక్షణతో పాటు దునిత్ వెల్లలాగే మోయగా ధనంజయ డిసిల్వ, చరిత్ అసలంకలు  పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా ఉంటూనే   కీలక వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్‌తో  ఆడిన తొలి మ్యాచ్‌లో పతిరాన నాలుగు వికెట్లు తీయగా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో రజిత, వెల్లలాగే, డిసిల్వ అదరగొట్టారు. సూపర్ - 4లో బంగ్లాతో మరోసారి జరిగిన పోరులో  తీక్షణ, శనక, పతిరాన తలా మూడు వికెట్లతో చెలరేగగా భారత్‌తో మ్యాచ్‌లో వెల్లలాగే, అసలంకలు టీమిండియా బ్యాటింగ్‌ను కకావికలం చేశారు. పాక్‌తో మ్యాచ్‌లో  రజిత లేకున్నా ప్రమోద్ మధుషన్ , పతిరానలు ఫర్వాలేదనిపించారు.


బ్యాటింగ్‌లో ఆ నలుగురు.. 


బౌలింగ్‌తో పాటే  బ్యాటింగ్‌లో కూడా ఆ జట్టు అద్భుతాలు చేసింది. టోర్నీ ఆసాంతం ఆ జట్టు కుశాల్ మెండిస్ అద్భుతంగా రాణించాడు.  అతడికి తోడుగా   ఓపెనర్ పతుమ్ నిస్సంక,  మిడిలార్డర్‌లో సదీర 
సమరవిక్రమ, చరిత్ అసలంకలు తమవంతు బాధ్యతలను సమర్థవంతంగా పోషించారు. గ్రూప్ దశలో అఫ్గాన్‌తో మ్యాచ్‌లో  తృటిలో సెంచరీ (92) కోల్పోయిన మెండిస్.. పాక్‌తో మ్యాచ్‌లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాతో తొలి మ్యాచ్‌లో సమరవిక్రమ, చరిత్ అసలంకలు అర్థ సెంచరీలతో రాణించారు. పాక్‌తో నిన్న ముగిసిన పోరులో నిస్సంకతో పాటు  మెండిస్, సమరవిక్రమలు రాణించారు. 


వాళ్లే టాప్.. 


పాక్‌తో మ్యాచ్ ముగిశాక  పాయింట్ల పట్టికలో అత్యధిక వికెట్లు, పరుగులు చేసిన ఆటగాళ్లలో  టాప్ -3లో లంకేయులే ఇద్దరు ఉండటం గమనార్హం. బౌలర్ల జాబితాలో పతిరాన.. ఐదు మ్యాచ్‌లలో 11 వికెట్లు తీయగా వెల్లలాగే ఐదు మ్యాచ్‌లలో పది వికెట్లు పడగొట్టాడు. షహీన్ షా అఫ్రిది కూడా ఐదు మ్యాచ్‌లలో పది వికెట్లు తీసి మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల జాబితాలో సైతం ఈ టోర్నీలో టాప్ - 3 బ్యాటర్లలో ఇద్దరూ లంకేయులే. కుశాల్ మెండిస్ ఐదు మ్యాచ్‌లలో 253 పరుగులు చేయగా సమరవిక్రమ ఐదు మ్యాచ్0లలో 215 రన్స్ సాధించాడు. మూడో స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్ ఐదు మ్యాచ్‌లలో 207 పరుగులు సాధించాడు. 


12వ ఫైనల్.. 


పాకిస్తాన్‌‌తో గురువారం రాత్రి  ఉత్కంఠగా ముగిసిన  మ్యాచ్‌లో  ఆఖరి ఓవర్‌లో లాస్ట్ బాల్‌కు రెండు పరుగులు తీసిన లంకేయులు ఆసియా కప్‌లో 12వ సారి అర్హత సాధించారు. వన్డే ఫార్మాట్‌లో ఆ జట్టుకు ఇది 11వ ఫైనల్ కాగా గతేడాది నిర్వహించిన టీ20 టోర్నీలో కూడా లంకదే ట్రోఫీ.. ఆదివారం లంక.. భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial