ఆసియా కప్‌లో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక రెండు వికెట్లతో విజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42 ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అనంతరం డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం శ్రీలంక లక్ష్యాన్ని 42 ఓవర్లలో 252 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని శ్రీలంక ఎనిమది వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది.


పాకిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (86: 73 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇఫ్తికర్ అహ్మద్ (47: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. పాకిస్తాన్ బ్యాటర్లలో కుశాల్ మెండిస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చరిత్ అసలంక చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు.


వర్షం దోబూచులాట
టాస్ కూడా పడకముందే ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మూడు గంటలకు పడాల్సిన టాస్ ఐదు గంటలకు పడింది. మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (4: 11 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో తొమ్మిది పరుగులకే పాకిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది.


కెప్టెన్ బాబర్ ఆజం (29: 35 బంతుల్లో, మూడు ఫోర్లు), ఓపెనర్ షఫిక్ (52: 69 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. బాబర్ ఆజం అవుటయ్యాక పాక్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 27.4 ఓవర్ల వద్ద ఐదు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సరిగ్గా ఈ దశలో వర్షం పడటంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. తగ్గాక మ్యాచ్‌ను తిరిగి 42 ఓవర్లకు కుదించారు.


మ్యాచ్ తిరిగి ప్రారంభం అయ్యాక పాకిస్తాన్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (86: 73 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఇఫ్తికర్ అహ్మద్ (47: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) నెక్స్ట్ లెవల్ బ్యాటింగ్ చేశారు. ఆరో వికెట్‌కు కేవలం 77 బంతుల్లోనే 108 పరుగులు జోడించారు. ఈ దశలో ఇఫ్తికర్ అహ్మద్ అవుటైనా మహ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ చివరి వరకు ఉన్నాడు. మొదటి 27.4 ఓవర్లలో పాకిస్తాన్ 130 పరుగులు చేసింది. తర్వాతి 14.2 ఓవర్లలో 122 పరుగులు చేయడం విశేషం.


థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్
252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. క్రీజులో ఉన్నంత సేపు వేగంగా ఆడిన కుశాల్ పెరీరా (17: 8 బంతుల్లో, నాలుగు ఫోర్లు) త్వరగానే అవుటయ్యాడు. పతుం నిశ్శంక (29: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కుశాల్ మెండిస్ (91: 87 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. పతుం నిశ్శంక అవుటయ్యాక... కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ (48: 51 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మూడో వికెట్‌కు 100 పరుగులు జోడించారు.


సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్ అవుటయ్యాక లంక తడబడింది. కానీ చరిత్ అసలంక (49: 47 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) చివరి బంతికి రెండు పరుగులు తీసి శ్రీలంకను మ్యాచ్‌లో గెలిపించి ఫైనల్‌కు తీసుకెళ్లాడు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial