Champion Trophy 2025: ఏ ముహూర్తాన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి పాకిస్తాన్ ముందుకు వచ్చిందో గాని ఆ క్షణం నుంచి దానికి వరుస కష్టాలు మొదలయ్యాయి. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ వందల కోట్లు ఖర్చుపెట్టి చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ నిర్వహిస్తోంది. కానీ టోర్నీ మొదలైన ఐదు రోజుల్లోనే పోటీ నుంచి అధికారికంగా ఔట్ అయిపోయింది పాకిస్తాన్ జట్టు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి ఇండియాపై ఎదురైన ఘోర ఓటమి ఆ జట్టును స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేస్తోంది. మైదానంలో మందకొండి ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో తెగించి షాట్లు కొట్టలేని వైనం, పసలేని బౌలింగ్, బాడీ లాంగ్వేజ్‌లో కనిపించని గెలవాలనే కసి ఇలా అన్ని విభాగాల్లోనూ క్రికెట్ అభిమానుల నుంచే కాకుండా పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ల నుంచి కూడా ఆ జట్టు విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా హోరాహోరీ పోరులో ఇంగ్లాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్ జట్టును చూసి పోరాటతత్వం నేర్చుకోవాలంటూ పాకిస్తాన్‌కు మళ్లీ మొట్టికాయలు పడుతున్నాయి మాజీల నుంచి.
అందర గొట్టిన ఆఫ్గాన్... ఇంటికి వెళ్ళిన ఇంగ్లాండ్
పేపర్‌పై చూస్తే తమకంటే బలమైన జట్టుగా కనిపించే ఇంగ్లాండ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీలో మట్టి కరిపించింది ఆఫ్ఘనిస్తాన్. 9 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కేవలం 37 పరుగులు చేసిన ఆ జట్టు 50 ఓవర్లు ముగిసేసరికి 325/7 స్కోర్ సాధిస్తుంది అని ఎవరూ ఊహించలేదు. ఆఫ్గాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ 177 (12 ఫోర్లు, 6 సిక్స్ లతో ) సాధించి హిస్టరీ క్రియేట్ చేస్తే బౌలింగ్‌లో ఇంగ్లాండ్ జట్టును మరో బాల్ మిగిలి ఉండగానే ఆల్ అవుట్ చేసింది. జోరూట్ 120 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఆఫ్గన్ బౌలర్ హజ్మతుల్లా ఐదు వికెట్లు సాధించడం విశేషం. దానితో చాంపియన్స్ ట్రోఫీలో చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఆఫ్గనిస్తాన్. ఇప్పుడు దీనినే సాకుగా చూపించి మరోసారి పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్నారు మాజీలు.
గెలవాలనే కసి లేదు : పాక్ మాజీలు
ఇంత పెద్ద ట్రోఫీ నిర్వహిస్తూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు వైఖరి మారాలంటూ మాజీ క్రికెటర్ షాయబ్ మాలిక్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ కప్‌లో సైతం ఇంగ్లాండ్‌ను ఓడించింది అని ఇప్పుడు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీలో దాన్ని రిపీట్ చేసిందని స్థిరంగా పెర్ఫార్మ్ చేయడమంటే ఇదేనని మాలిక్ అభిప్రాయపడ్డాడు. లాహోర్‌లో చివరికి ఆఫ్ఘనిస్తాన్ కూడా 300 స్కోర్ చేస్తే సొంత దేశంలో ఆడుతూ కూడా పాకిస్తాన్ జట్టు ఇంకా దాన్ని చేరుకోలేదని ఎద్దేవా చేశారు. మరో మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ అయితే తమకంటూ ఏ వినోదమూ లేని దేశంగా మిగిలిపోయిన ఆఫ్గనిస్తాన్ క్రికెట్ ద్వారా ప్రపంచానికి సందేశం ఇవ్వాలనుకుంటుందని ఆ కసి వాళ్ళలో కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. తమ దేశ యువతలో స్ఫూర్తి నింపడం కోసం ఆ జట్టు ఆడుతుందని అదే ఆ జట్టును నడిపిస్తుందన్న హఫీజ్ మ్యాచ్ మ్యాచ్‌కీ ఆఫ్ఘనిస్తాన్ టీం లో కనిపిస్తున్న గ్రోత్ పాకిస్తాన్ జట్టులో కనిపించడం లేదని అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ టీమ్.. మీకు నా ముద్దులు : షోయబ్ అక్తర్
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయిబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ టీంకు ఒక చెంపపై ముద్దు మరో చెంపపై పప్పీ ఇస్తున్నట్టు చెబుతూ అభినందనలు తెలిపారు. గత వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా టీంతో ఆడుతున్నప్పుడు మ్యాక్స్ వెల్ పోరాటంతో ఆఫ్ఘనిస్తాన్ టీం ఓడిపోయి కొద్దిలో టోర్నీ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని అది తనని ఇప్పటికీ బాధిస్తుందని తెలిపాడు అక్తర్. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా,సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్లతో పోటీ పడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఈసారి సెమీస్ చేరాలని కోరుతున్నట్టు చెప్పాడు అక్తర్. ప్రస్తుతం ఉపఖండంలో క్రికెట్ జట్లలో ఇండియా తర్వాతి స్థానం ఆఫ్ఘనిస్తాన్‌దే అంటూ పాక్ మాజీలు పొగుడుతూనే ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్ జట్టుపై పంచులు వేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే పాకిస్తాన్ పరాజయాలను ఆఫ్గాన్ విజయంతో పోలుస్తూ ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. అయితే వీటిలో అధిక భాగం పాకిస్తాన్ నుంచే కావడం ఆ జట్టు దుస్థితిని తెలియజేస్తుంది.
Also Read: ఆఫ్గాన్ అద్భుత విజయం.. టోర్నీ నుంచి ఇంగ్లాండ్ ఔట్.. రూట్ సెంచరీ వృథా