సచిన్‌‌కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని క్రీడా పండితులు తేల్చేశాక తానున్నానని దూసుకొచ్చిన విరాట్‌ కింగ్‌ కోహ్లీ... ఇప్పుడు ఆ క్రికెట్‌ దేవుడి సరసన సగర్వంగా నిలిచాడు. సచిన్‌ సృష్టించిన రికార్డులను పరుగుల ప్రవాహంతో బద్దలు కొట్టిన కోహ్లీ.... వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ సరసన చేరాడు. 49 సెంచరీలతో సచిన్‌తో సమానంగా నిలిచి తాను ఎంతటి గొప్ప ఆటగాడినో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటిచెప్పాడు. వైఫల్యాల మధ్యే మూడు పుట్టిన రోజులు జరుపుకొన్న ‘కింగ్ కోహ్లీ... ఈ పుట్టిన రోజున తాను ఎంతో ఆరాధించే సచిన్ రికార్డును సమం చేసి తనకు తానే మరచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చుకున్నాడు. భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించి అభిమానులకు మరచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచకప్‌ కల నెరవేర్చుకునేందుకు రెండే అడుగుల దూరంలో ఉన్న సమయంలో... నాకౌట్‌ పోరులో అద్భుత శతకంతో కోహ్లీ చెలరేగి కప్పుతో పాటు సచిన్‌ రికార్డును బద్దలు కొడితే భారత క్రికెట్‌ అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంది.


పదిహేనేళ్ల కెరియర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. మరెన్నో రివార్డులను అందుకున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు మొత్తం 49 సెంచరీలు చేసి.. లెజెండరీ క్రికెటర్ సచిన్ ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ రికార్డును సమం చేశాడు. తన సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరియర్‌‌‌‌‌‌‌‌లో 79 సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. వన్డేల్లో 49, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక శతకం చేశాడు.  ఇప్పుడు సచిన్ రికార్డు బ్రేక్ చేసేందుకు విరాట్‌ ఒక అడుగు దూరంలో ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 50 సెంచరీల రికార్డును ఈ ప్రపంచకప్‌‌‌‌లోనే కోహ్లీ సాధించే అవకాశం ఉంది. 


కోహ్లీ క్రికెట్ జర్నీలో ఎన్నో మైలు రాళ్లు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎదురుదెబ్బలు తిన్నా.. ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థానంలో ఉంటున్నాడు. 2023లో కోహ్లి అంతర్జాతీయ పరుగులు 1500 దాటాయి. ఆరు సెంచరీలు చేశాడు. ప్రపంచకప్ కంటే ముందు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో అద్భుత శతకంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో తనదైన ఆటతో అదరగొడుతున్నాడు.  8 ఇన్నింగ్స్‌ల్లో దాదాపు 90 సగటుతో 550కిపైగా పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలతో పాటు నాలుగు అర్ధసెంచరీలున్నాయి. ఆస్ట్రేలియాపై 85, న్యూజిలాండ్‌పై 95, శ్రీలంకపై 88 పరుగుల వద్ద విరాట్‌ ఔటయ్యాడు. అందులో ఏ ఒక్కటైనా సెంచరీగా మారిన సచిన్‌ రికార్డు ఈపాటికే బద్దలయ్యేది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఏడాది పది సెంచరీలు చేసి శతకాలు సాధించడం ఇంత తేలికా అనేలా చేశాడు కోహ్లీ. వన్డేల్లో 2017, 2018 సంవత్సరాల్లో ఆరు చొప్పున 12 శతకాలు బాదాడు. 2012, 2019లో ఐదు చొప్పున శతకాలు కొట్టాడు. ఇక టెస్టుల్లోనూ 2017, 2018లో ఐదేసి చొప్పున 10 శతకాలు కొట్టాడు. ఇటీవల టీ20ల్లో తొలి సెంచరీని అఫ్గానిస్తాన్‌‌‌‌పై నమోదు చేశాడు. 


2014లో టెస్టులకు ధోనీ రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రకటించడంతో సారథిగా కోహ్లీ ఎంపికయ్యాడు. 2017లో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌‌‌‌ అయ్యాడు. కెప్టెన్‌‌‌‌గా ఉన్నప్పుడే ఎక్కువగా పరుగులు చేసిన కోహ్లీ.. ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. టెస్టుల్లో 68 మ్యాచ్‌‌‌‌లకు కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించాడు కోహ్లీ. అందులో 40 మ్యాచ్‌‌‌‌లు టీమిండియా గెలిచింది. 17 ఓడిపోగా, 11 డ్రాగా ముగిశాయి. వన్డేల్లో 95 మ్యాచ్‌‌‌‌లకు కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించగా.. 65 గెలిపించాడు. టీ20 ల్లో 50 మ్యాచ్‌‌‌‌లకు కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించి 30 గెలిపించాడు.