ప్రపంచకప్‌లో నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకను అఫ్గాన్‌ బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. అఫ్ఘానిస్థాన్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో లంక 49.3 ఓవర్లలో 241 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్ఘానిస్థాన్‌ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లంక  బ్యాటర్లకు ఆదిలోనే షాక్‌ తగిలింది. స్కోరు బోర్డుపై 22 పరుగులు చేరగానే కరుణరత్నే పెవిలియన్‌ చేరాడు. 21 బంతుల్లో 15 పరుగులు చేసిన కరుణరత్నేను ఫరూకీ అవుట్‌ చేసి అఫ్గాన్‌కు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత నిసంక, కుశాల్‌ మెండీస్‌ జోడి లంక స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. రెండో వికెట్‌కు 62 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో లంక కోలుకుంది. మరింత ప్రమాదకరంగా మారుతున్న  ఈ జంటను ఒమ్రజాయ్‌ విడదీశాడు. అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న నిసంకను ఒమ్రజాయ్‌ అవుట్‌ చేశాడు. 60 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసిన నిసంక పెవిలియన్‌ చేరాడు. దీంతో 84 పరుగుల వద్ద లంక రెండో వికెట్‌ కోల్పోయింది.



 అనంతరం కుశాల్‌ మెండీస్‌... సధీర సమరవిక్రమ మరో మంచి భాగస్వామ్యం నమోదు చేశారు. సాఫీగా సాగుతున్న లంక ఇన్నింగ్స్‌ను ఈసారి ముజిబుర్‌ రెహ్మన్‌ దెబ్బకొట్టాడు. 50 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసిన మెండీస్‌ను ముజీబర్‌ రెహ్మన్‌ అవుట్‌ చేశాడు. 134 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి లంక పటిష్టంగానే కనిపించింది. కానీ కాసేపటికే ఈ ప్రపంచకప్‌లో ఫామ్‌లో ఉన్న సధీర సమరవిక్రమను అవుట్‌ చేసి ముజీబుర్‌ రెహ్మన్‌ లంకకు షాక్ ఇచ్చాడు. స్కోరు బోర్డుపై మరో అయిదు పరుగులు చేరాయో లేదో సమరవిక్రమ  పెవిలియన్‌ చేరాడు. తర్వాత కూడా వరుస విరామాల్లో లంక వికెట్లను కోల్పోయింది. 26 బంతుల్లో 14 పరుగులు చేసిన ధనుంజయ డిసిల్వను స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌల్డ్‌ చేసి లంకను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఆచితూచి ఆడుతున్న చరిత్‌ అసలంకను కూడా ఫరూకీ అవుట్‌ చేయడంతో 180 పరుగులకు లంక ఆరు వికెట్లు కోల్పోయింది. అసలంక 28 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆ వెంటనే చమీర రనౌట్‌ కావడం భారీ స్కోరు చేయాలన్న లంక ఆశలకు గండికొట్టింది. 4 బంతుల్లో కేవలం ఒకే పరుగు చేసిన చమీర రనౌట్‌ అయ్యాడు. దీంతో అఫ్గాన్‌ 185 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.



 తర్వాత మహేశ్‌ తీక్షణ, ఏంజెలో మాధ్యూస్‌ లంక స్కోరు బోర్డును నడిపించారు. 26 బంతుల్లో ఒక సిక్సు, ఒక ఫోర్‌తో మాథ్యూస్‌ 23 పరుగులు చేయగా.... తీక్షణ 31 బంతుల్లో 3 ఫోర్సు, ఒక సిక్సుతో 29 పరుగులు చేశాడు. వీళ్లిద్దరి భాగస్వామ్యంతో లంక 200 పరుగుల మార్కును దాటింది. కానీ వెంటవెంటనే వీరు అవుటయ్యారు. ఏంజెలో మాధ్యూస్‌, తీక్షణను ఫరూకీ అవుట్‌ చేయడంతో భారీ స్కోరు చేయాలన్న లంక ఆశలు నెరవేరలోదు. లంక 49.3 ఓవర్లలో 241 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరూకీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఫరూకీ కేవలం 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చాడు. ముజీబుర్ రెహ్మన్‌ 2, ఒమ్రజాయ్ 1, రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ నేలకూల్చారు. లంక బ్యాటర్లలో ఒక్కరు కూడా అర్ధశతకం సాధించలేదు. 



 అఫ్గాన్‌పైనా గెలిచి సెమీస్‌ అవకాశాలను చేజారనివ్వద్దని లంక భావిస్తోంది. కానీ ఈ ప్రపంచకప్‌లో రెండు అద్భుత విజయాలతో అఫ్గాన్‌ మంచి ఫామ్‌లో ఉంది. ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌లపై అద్భుత విజయాలతో ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘానిస్తాన్ సంచలన విజయాలు నమోదు చేసింది. ఇప్పటికే అగ్ర జట్లకు షాక్‌ ఇచ్చిన అఫ్గాన్‌.. ఇప్పుడు లంకకు షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. పేసర్ చమీరాపై కూడా లంక ఆశలు పెట్టుకుంది. దిల్షాన్ మధుశంక 11, కుసన్ రజిత 7 వికెట్లతో ఈ ప్రపంచకప్‌లో పర్వాలేదనిపించారు. మహేష్ తీక్షణ అనుకున్నంత రాణించడం లేదు. వీళ్లు మరోసారి రాణిస్తే లక్ష్య చేధనలో అప్గాన్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. కానీ లంకపైనా విజయం సాధించి సెమీస్‌ అవకాశాలు మెరుగు పర్చుకోవాలని అఫ్గాన్‌ బ్యాటర్లు భావిస్తున్నారు.