South Africa won Against Afghanistan: ఈ ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికా(South Africa) మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఛేజింగ్‌ వీక్‌నెస్‌ను ఛేదిస్తూ అఫ్గానిస్థాన్‌(Afghanistan)పై విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో కాస్త తడ్డబడ్డా చివరికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గాన్‌ 244 పరుగులకు ఆలౌట్‌ అయింది.  ఒమ్రాజాయ్‌ 97 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.3 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 15 బంతులు మిగిలి ఉండగానే ప్రొటీస్‌ విజయం సాధించింది.


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గాన్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జర్దాన్‌ పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ఈ జోడీని కేశవ్‌ మహరాజ్‌ విడదీశాడు. 22 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 25 పరుగులు చేసిన రహ్మతుల్లా గుర్బాజ్‌ను కేశవ్‌ మహరాజ్‌ అవుట్‌ చేసి వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. అదే స్కోరు వద్ద ఇబ్రహీం జర్దాన్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. స్కోరు బోర్డుపై మరో మూడు పరుగులు చేరాయో లేదో హస్మతుల్లా షాహీదీ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో 41 పరుగుల వద్ద ఒక్క వికెట్‌ కోల్పోని అఫ్గాన్‌ 45 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో అజ్మతుల్లా ఒమ్రాజాయ్‌ అఫ్గాన్‌ను ఆదుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు. రహ్మత్‌ షాతో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఓ వైపు సఫారీ బౌలర్లు వికెట్లును తీస్తూ వచ్చారు. 46 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసిన రహ్మత్‌ షాను ఎంగిడి అవుట్‌ చేశాడు. 


14 బంతుల్లో 12 పరుగులు చేసిన ఇక్రమ్‌ అలిఖిల్‌... 2 పరుగులు చేసిన మహ్మద్‌ నబీ..14 పరుగులు చేసి రషీద్‌ ఖాన్ వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో 116 పరుగులకే అఫ్గాన్ ఆరు వికెట్లు కోల్పోయింది. ఓ పక్క వికెట్లు పడుతున్నా ఒమ్రాజాయ్‌ పోరాడాడు. టెయిలెండర్లతో కలిసి అఫ్గాన్‌కు పోరాడే స్కోరును అందించాడు. 107 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లతో ఒమ్రాజాయ్‌ 97 పరుగులు అజేయంగా నిలిచాడు. చివరి రెండు బంతులు మిగిలి ఉన్న దశలో ఒమ్రాజాయ్‌ సెంచరీ చేస్తాడని అనుకున్నా నవీన్‌ ఉల్‌ హక్‌ రనౌట్‌ కావడంతో ఆ ఆశ నెరవేరలేదు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గాన్‌ 244 పరుగులకు ఆలౌట్‌ అయింది. ప్రొటీస్‌ బౌలర్లలో కోట్జే నాలుగు, ఎంగిడి రెండు, మహరాజ్ రెండు వికెట్లు తీశాడు. 


 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టుకు శుభారంభం దక్కింది. డికాక్‌, బవుమా తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. 28 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన బవుమాను ముజీబుర్‌ రెహ్మాన్‌ అవుట్‌ చేసి అఫ్గాన్‌కు తొలి వికెట్‌ అందించాడు. 47 బంతుల్లో 41 పరుగులు చేసి డికాక్‌ కూడా అవుటయ్యాడు. మార్‌క్రమ్‌ 25 పరుగులకు, క్లాసెన్‌ 10 పరుగులకు, డేవిడ్‌ మిల్లర్‌ 24 పరుగులకు అవుటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ అఫ్గాన్‌కు అవకాశం ఇవ్వకుండా డసెన్‌.. పెహ్లోక్వాయో..దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. డసెన్‌ 95 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సుతో 76,  పెహ్లోక్వాయో 37 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సులతో 39 పరుగులు చేయడంతో ప్రొటీస్‌ మరో 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టించిన అఫ్గాన్‌ వెనుదిరిగింది.