డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు తొలి మ్యాచ్‌లోనే షాక్ ఇచ్చిన న్యూజిలాండ్.. రేపు(సోమవారం) రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అయితే తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన కివీస్ సారధి కేన్ విలియమ్సన్.. రెండో మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మ్యాచ్‌కు ముందు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. విలియమ్సన్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడన్న గ్యారీ స్టెడ్... కానీ అతడు పూర్తిగా కోలుకోవాల్సి ఉందని తెలిపాడు. రెండో మ్యాచ్‌కు కూడా విలియమ్సన్ దూరంగా ఉంటాడని, కానీ మూడో మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నట్లు కివీస్ హెడ్ కోచ్ తెలిపాడు.
కేన్ త్వరగా కోలుకుని ఈ మెగా టోర్నీలో జట్టుతో కలవాలనే తాము కోరుకుంటున్నామని వివరించాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను తాము తేలిగ్గా తీసుకోవట్లేదన్న కివీస్ కోచ్.. పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు. మార్చిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో విలియమ్సన్ మోకాలి గాయమైంది. గాయం నుంచి విలియమ్సన్ కోలుకుంటున్నాడు. కేన్ విలియమ్సన్ గైర్హాజరీతో దక్కిన అవకాశాన్ని రచిన్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
న్యూజిలాండ్ సోమవారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫెర్గూసన్, టిమ్ సౌతీ ఫిట్‌నెస్‌పై కూడా కివీస్ కోచ్ స్పందించాడు. ఫెర్గూసన్ ఫిట్‌నెస్ సాధించేందుకు కఠిన శిక్షణ పొందుతున్నాడని నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని స్టెడ్ తెలిపాడు. టిమ్ సౌతీకు ఎక్స్ రే తీయించామని వైద్యుల సలహా మేరకు అతడిని జట్టులికి తీసుకోవాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని వివరించాడు.
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. గత ప్రపంచ కప్‌లో త్రుటిల్లో చేజారిన కప్‌ను ఈసారి దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న కివీస్.. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లు డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర శతకాలతో చెలరేగడంతో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను న్యూజిలాండ్ చిత్తు చేసింది. బ్రిటీష్ బౌలర్లను ఊచకోత కోసిన కివీస్ బ్యాటర్లు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి.. ఇంగ్లాండ్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని మరో 82 బంతులు మిగిలి ఉండగానే సునాయసంగా ఛేదించారు. 273 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో కాన్వే, రచిన్ రవీంద్ర కివీస్‌కు ఘన విజయం అందించారు.
న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఇంగ్లాండ్‌పై అద్భుత సెంచరీతో ప్రపంచ క్రికెట్ అభిమానుల చూపును తన వైపునకు తిప్పుకున్నాడు. 93 బంతుల్లోనే అజేయంగా 123 పరుగులు చేసి సంచలన సృష్టించాడు. భారత సంతతి ఆటగాడైన రచిన్.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చాడు. అతనిలో ఇంత బ్యాటర్ ఉన్నాడని క్రికెట్ ప్రేమికులు ఊహించలేకపోయారు. అద్భుతమైన డిఫెన్స్.. కళాత్మక డ్రైవ్‌లు... భారీ షాట్లతో రచిన్.. మొదటి మ్యాచ్‌లోనే తన ముద్ర వేశాడు. 2019 ప్రపంచకప్‌ను ఓ అభిమానిగా వీక్షించిన ఈ కివీ ఆటగాడు.. ఇప్పుడు ఈ మెగా టోర్నీలో భాగమై న్యూజిలాండ్‌కు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాడు.