స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్రకు న్యూజిలాండ్‌ కూడా బ్రేక్‌ వేయలేకపోయింది. మహా సంగ్రామంలో వరుసగా అయిదో విజయం నమోదు చేసింది. 2019 సెమీస్‌లో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. షమీ బౌలింగ్‌లో మెరిసిన వేళ... కింగ్‌ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన వేళ కివీస్‌పై భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఆరు  వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్‌ కోహ్లీ 104 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సులతో 95 పరుగులు చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. టీమిండియా విజయానికి  కోహ్లీ సెంచరీకి నాలుగు పరుగులు కావాల్సిన దశలో కోహ్లీ అవుట్‌ కావడం అభిమానులకు నిరాశ కలిగించింది. కోహ్లీ సెంచరీ కూడా చేసుంటే ఈ విజయం మరింత పరిపూర్ణమయ్యేది.



మెరిసిన షమీ
 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ... న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో సారధి రోహిత్‌ నిర్ణయం సరైందేనని కాసేపటికే అర్ధమైంది. బుమ్రా.. సిరాజ్‌.. షమీ.. ఆరంభంలో కట్టుదిటంగా బౌలింగ్‌ చేశారు. ఆరంభంలోనే వికెట్‌ తీసి మహ్మద్‌ సిరాజ్‌ కివీస్‌కు షాక్‌ ఇచ్చాడు. ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కాన్వే సిరాజ్‌ బౌలింగ్‌లో అయ్యర్‌ పట్టిన చురుకైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కాన్వే ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో తొమ్మిది పరుగులకే న్యూజిలాండ్ తొలి వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న షమీ.. కివీస్‌కు రెండో షాక్‌ ఇచ్చాడు. విల్‌ యంగ్‌ను షమీ బౌల్డ్‌ చేయడంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ రచిన్‌ రవీంద్ర, డేరిల్‌ మిచెల్‌ అద్భుత భాగస్వామ్యంతో కివీస్‌ మళ్లీ పోరులోకి వచ్చింది. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి కివీస్‌ భారీ స్కోరుకు బాటలు వేశారు. 87 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో 75 పరుగులు చేసిన రచిన్‌ రవీంద్ర... షమీ బౌలింగ్‌లో గిల్‌కు సులభమైన క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. రచిన్‌ రవీంద్ర అవుటైనా మిచెల్‌ పోరాటం ఆపలేదు. ఒక వైపు వికెట్లు పడతున్నా మిచెల్‌ మాత్రం పట్టువదలలేదు. 127 బంతుల్లో 9 ఫోర్లు, అయిదు  సిక్సర్లతో 130 పరుగులు చేశాడు. మిచెల్‌ శతకంతో న్యూజిలాండ్‌ 273 పరుగులు చేసింది. ఓ దశలో 300 పరుగులు చేస్తుందనుకున్న కివీస్‌... టీమిండియా బౌలర్లు రాణించడంతో 280 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో బ్రుమా 1, మహ్మద్‌ సిరాజ్‌ 1, షమీ 5, కుల్‌దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీశారు. ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న షమీ 10 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 54 పరుగులు ఇచ్చి 5 వికెట్లు నేలకూల్చి సత్తా చాటాడు. 



అదిరే ఆరంభం
 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. రోహిత్ శర్మ- శుభ్‌మన్‌ గిల్‌ జోడి తొలి వికెట్‌కు 11 ఓవర్లలోనే  71 పరుగులు చేసి బలమైన పునాది వేసింది. కివీస్‌ బౌలర్లను సులభంగా ఎదుర్కొన్న ఈ జోడి ధాటిగా బ్యాటింగ్ చేసింది. కానీ 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి దూకుడు మీదున్న రోహిత్‌ను ఫెర్గ్యూసన్‌ బౌల్డ్‌ చేశాడు. కాసేపటికే 26 పరుగులు చేసిన గిల్‌ కూడా ఔట్‌ అయ్యాడు. దీంతో 76 పరుగులకు టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత కోహ్లీ, అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించారు. ముఖ్యంగా కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి టీమిండియాకు కీలక విజయాన్ని అందించాడు. అయ్యర్‌ కూడా కోహ్లీకి మంచి సహకారం అందించాడు. కానీ ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను బౌల్ట్‌ విడదీశాడు. 33 పరుగులు చేసిన అయ్యర్‌ను అవుట్‌ చేశాడు. 27 పరుగులు చేసిన రాహుల్‌ అవుటవ్వడం.. అనవసర పరుగుకు యత్నించి సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా పెవిలియన్‌ చేరడంతో 191 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు కష్టాల్లో పడ్డట్లు అనిపించింది. కానీ విరాట్‌ కోహ్లీ-రవీంద్ర జడేజా అద్భుత భాగస్వామ్యంతో విజయాన్ని అందించారు.


సాధికారికంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ  104 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సులతో 95 పరుగులు చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చివర్లో కోహ్లీ అవుటైనా అప్పటికే టీమిండియా విజయం ఖాయమైంది. రవీంద్ర జడేజా 44 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో టీమిండియా ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.