ప్రపంచకప్‌లో ఎదురొచ్చిన ప్రతి జట్టునూ ఓడిస్తూ సెమీస్‌లో అడుగు పెట్టిన భారత్‌... దక్షిణాఫ్రికా ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో సారధి రోహిత్ శర్మ విధ్వంసం... పుట్టినరోజు నాడు కోహ్లీ శతకంతో చెలరేగడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326  పరుగులు చేసింది. 119 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ సాధించి విరాట్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ రికార్డును సమం చేశాడు. భారత బౌలర్లు  అద్భుతంగా రాణిస్తున్న వేళ... జట్టు నిండా పవర్‌ హిట్టర్లు ఉన్న దక్షిణాఫ్రికా 327 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందేమో చూడాలి. కానీ భారత పేస్‌ త్రయం బుమ్రా, షమీ, సిరాజ్‌లను ఎదుర్కొని ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై 327 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత తేలిగైన విషయం కాదు.

 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా రోహిత్ సేన బరిలోకి దిగింది. రోహిత్‌ శర్మతో కలిసి... శుభ్‌మన్‌ గిల్‌ భారత్‌ జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. రోహిత్‌ దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. దీంతో ఆరంభంలో టీమిండియా స్కోరు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది. రోహిత్‌ దూకుడుతో కేవలం 4.3 ఓవర్లలోనే భారత స్కోరు 50 పరుగుల మార్కు దాటింది. 

జట్టు స్కోరు ఆరు ఓవర్లలో 62 పరుగులు ఉన్న సమయంలో రోహిత్ శర్మ అవుటయ్యాడు. కేవలం 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్‌ 40 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం కాసేపటికే గిల్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్సుతో 23 పరుగులు చేసి గిల్‌ అవుటయ్యాడు. అనంతరం బర్త్‌ డే బాయ్‌ విరాట్‌ కోహ్లీ, శ్రేయస్స్‌ అయ్యర్‌ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన అయ్యర్‌ ఆ తర్వాత ధాటిగా బ్యాటింగ్ చేశాడు.  87 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 77 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న అయ్యర్‌ను ఎంగిడి అవుట్‌ చేశారు. ఆ తర్వాత కాసేపటికే కేఎల్ రాహుల్ కూడా అవుటయ్యాడు. 17 బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు చేసిన రాహుల్‌ను జాన్సన్‌ అవుట్‌ చేశాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో 49వ సెంచరీని 119 బంతుల్లో అందుకున్నాడు. అందులో 10 ఫోర్లు ఉన్నాయి. 

 

మొత్తం 121 బంతులు ఎదుర్కొన్న విరాట్‌...101 పరుగులతో అజేయంగా నిలిచాడు. పిచ్‌పై బంతి తిరుగుతున్న వేళ కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సెంచరీతో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ రికార్డును కోహ్లీ సమం చేశాడు. చివర్లో సూర్యకుమార్‌ యాదవ్ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేసి సూర్య పెవిలియన్‌ చేరాడు. చివర్లో కోహ్లీతో జత కలిసిన రవీంద్ర జడేజా బ్యాటు ఝుళిపించడంతో భారత్‌  స్కోరు 300 పరుగులు దాటింది. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేశారు. రవీంద్ర జడేజా కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో 29 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326  పరుగులు చేసింది. 

 

టీమిండియా బౌలింగ్‌ విభాగం పిచ్‌పై నిప్పులు చెరుగుతోంది. శ్రీలంకను కేవలం 55 పరుగులకే కుప్పకూల్చి సత్తా చాటింది. ఆడిన మూడు మ్యాచుల్లో మహమ్మద్ షమీ రెండోసార్లు అయిదు వికెట్లు తీసి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా, సిరాజ్‌ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా కూడా రాణిస్తుండడంతో టీమిండియా బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. పటిష్టమైన టీమిండియా బౌలింగ్‌ను ఎదుర్కొని 327 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్‌ ఛేదించాల్సి ఉంది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు 428 దక్షిణాఫ్రికా పేరు మీదే ఉంది. అయిదు మ్యాచుల్లో ప్రొటీస్‌ 300కుపైగా పరుగులు చేసింది. డి కాక్ ఏడు మ్యాచ్‌ల్లో 545 పరుగులతో ఈ ప్రపంచకప్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. కానీ లక్ష్యాన్ని ఛేదించడంలో ప్రొటీస్‌ తడబడుతోంది.