ODI World Cup 2023 : భారత్ - పాకిస్తాన్ సమరానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం  సర్వాంగ సుందరంగా ముస్తాబవువుతున్నది. వరల్డ్ కప్‌లోనే క్రేజీయెస్ట్ గేమ్‌గా అభివర్ణిస్తున్న ఈ పోరు చూడాలంటే క్రికెట్ ఫ్యాన్స్ జేబుల్లో మినిమం బ్యాలెన్స్‌లు లక్షల్లో ఉంటే గానీ  ఆ ఆటను ఆస్వాదించడం గగనంగానే ఉంది. ఇరు దేశాల మధ్య ఉండే భావోద్వేగాల నేపథ్యంలో అత్యంత క్రేజ్ కలిగిన ఈ మ్యాచ్‌ మొత్తం ప్రపంచకప్‌లోనే  ‘కాస్ట్లీయెస్ట్ మ్యాచ్’ అవుతుందనడంలో  సందేహమే లేదు. ఇప్పటికే అహ్మదాబాద్‌లో సీట్ల టికెట్ రేట్లు, హోటల్ అద్దె ఆకాశాన్ని తాకిన వేళ  ఇప్పుడు వాయింపు విమాన రంగానిది.  భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరిగే రోజు అయిన అక్టోబర్ 14న అక్కడికి విమాన ఛార్జీలు సాధారణ రోజుల్తో పోలిస్తే ఏకంగా 415 శాతం పెరిగాయి. 


సాధారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అహ్మదాబాద్‌కు విమాన ఛార్జీలు రూ. 5,500 - రూ. 12 వేల వరకూ (రౌండ్ ట్రిప్‌కు) ఉంటాయి.  కానీ   అక్టోబర్ 13 - 15 తేదీలలో  మాత్రం ఈ రేట్లలో  భారీ మార్పులు వచ్చాయి.   భారత్ - పాక్ మ్యాచ్ చూసేందుకు గాను అహ్మదాబాద్ (ఫ్లైట్‌లో) వెళ్లిరావడానికి ఈనెల 20న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు విమానయాన సంస్థలు షాకిచ్చాయి.  ఉదాహరణకు  హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌ ట్రిప్‌కు సాధారణ రోజుల్లో అయితే ఫ్లైట్ ఛార్జి రూ. 12 వేలు ఉంటుంది. కానీ అక్టోబర్  13-15 తేదీలలో ఇది  రూ. 40,563కు పెరిగింది.  అంటే సాధారణ రోజుల్తో పోలిస్తే 238.8 శాతం పెరుగుదల నమోదైంది. ఇలాంటివే మరికొన్ని.. 


- అహ్మదాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న నగరం ముంబై. దేశ వాణిజ్య రాజధాని నుంచి అహ్మదాబాద్‌కు విమాన ఛార్జీ  సాధారణ రోజుల్లో అయితే రూ. 5,500 మాత్రమే. కానీ దాయాదుల పోరు జరిగే రోజుకు ముందు, తర్వాత మాత్రం  రూ. 16,785గా (205 శాతం పెరుగుదల) ఉంది. 


- పాట్నా నుంచి అహ్మదాబాద్‌కు సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ. 12 వేలు. ఇది రూ. 34,293కు (185 శాతం) పెరిగింది. 


- ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు రూ. 7,500గా ఉన్న టికెట్ ధర.. రూ. 24,458కి (223 శాతం)  పెరిగింది. 


- చండీగఢ్ నుంచి అహ్మదాబాద్‌కు  సాధారణ రోజుల్లో రూ. 8,500గా ఉన్న విమాన టికెట్ ధర ఆ మూడు రోజుల్లో మాత్రం ఏకంగా రూ. 43,833కు (415.7 శాతం పెరుగుదల)   పెరిగింది. 


ఇవేగాక  లక్నో, భోపాల్, కోల్‌కతా, భువనేశ్వర్, పూణె నుంచి  అహ్మదాబాద్‌కు విమాన ఛార్జీలు మండిపోతున్నాయి.   మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా  విమానయాన సంస్థలు  మరిన్ని ఫ్లైట్లను నడిపించాలని ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ గుజరాత్ అధ్యక్షుడు అనూజ్ పతక్  కోరాడు. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, మీడియా,  అభిమానులు,   స్పాన్సర్లు భారీ స్థాయిలో వచ్చే అవకాశంమున్నందున  అదనపు ఫ్లైట్స్‌ను నడిపించి ప్రయాణీకలకు ఇబ్బందికలగకుండా చూడాలని  అభ్యర్థించాడు. 


ఇప్పటికే అహ్మదాబాద్‌లో హోటల్ రేట్లు భారీగా పెరిగాయి.  అక్టోబర్ 13 - 15 మధ్య  అక్కడ ఏ చిన్న హోటల్‌లో దిగినా  రోజుకు  రూ. 30 వేల నుంచి రూ. 50 వేలు వదిలించుకోవాల్సిందే. ఇక స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ అయితే  మినిమం లక్ష  జేబులో లేకుంటే వాళ్లు కనీసం  లోపలికి అడుగు కూడా పెట్టనిచ్చేట్టు లేరు.