NZ vs SL 2nd Test: స్వదేశంలో తమకు ఎదురులేదని న్యూజిలాండ్ మరోసారి నిరూపించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉండి  కివీస్ ను  2-0 తేడాతో ఓడిస్తే  తుది పోరులో ఆస్ట్రేలియాతో తలపడొచ్చని భావించి   న్యూజిలాండ్  పర్యటనకు వెళ్లిన లంకకు టెస్టులలో షాకులు తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో  లంకను ఓడించిన సౌథీ సేన.. రెండో టెస్టులో అలవోకగా గెలిచి  రెండు మ్యాచ్‌ల సిరీస్ ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్  చేసింది. 


మ్యాచ్ సాగిందిలా... 


వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్..   తొలి ఇన్నింగ్స్ లో  నాలుగు వికెట్ల నష్టానికి  580 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే.  కివీస్ తరఫున  ఆ జట్టు మాజీ సారథి కేన్ విలియమ్సన్  (215), హెన్రీ నికోల్స్ (200 నాటౌట్) లు డబుల్ సెంచరీలు బాదారు.  డెవాన్ కాన్వే (78) కూడా రాణించాడు.  రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేయడం ద్వారా  కేన్ మామ.. టెస్టులలో ఆరు ద్విశతకాలు బాదిన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వగ్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. 


అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆడేందుకు వచ్చిన   శ్రీలంక..  66.5  ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె (89)  ఒక్కడే రాణించాడు.  తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడిన లంక.. రెండో ఇన్నింగ్స్ లో కాస్త మెరుగ్గానే రాణించింది.   కరుణరత్నె (51), కుశాల్ మెండిస్ (50), దినేశ్ ఛండిమాల్ (62) లు ఫర్వాలేదనిపించారు.  ధనంజయ డిసిల్వ  (98) రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. వికెట్ కీపర్ నిషాన్ మధుష్క  (38) అతడికి తోడుగా నిలిచాడు.   రెండో ఇన్నింగ్స్ లో లంక.. 358 పరుగులకు ఆలౌట్ అయింది.  కివీస్ బౌలర్లలో కెప్టెన్ టిమ్ సౌథీ, బ్లయర్ టిక్నర్  లు తలా మూడు వికెట్లు తీయగా  మైఖేల్ బ్రాస్‌వెల్  రెండు వికెట్లు తీశాడు.  ఈ విజయంతో   కివీస్ రెండు మ్యాచ్ ల సిరీస్ ను  2-0తో గెలుచుకుంది.  తొలి టెస్టులో కాస్తో కూస్తో ప్రతిఘటించిన లంక.. రెండో టెస్టులో మాత్రం అటు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా దారుణంగా విఫలమై తగిన మూల్యం చెల్లించుకుంది. 


 






కేన్ మామకే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. 


ఈ సిరీస్ లో తొలి  టెస్టులో సెంచరీ తో పాటు రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన  కేన్ విలియమ్సన్ కు  ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.  రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన హెన్రీ నికోల్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. టెస్టులు ముగియడంతో  ఇరు జట్ల మధ్య  మార్చి 25 నుంచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 2 నుంచి టీ20 సిరీస్ జరగాల్సి ఉంది.