ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు చేతులెత్తేశారు. కివీస్‌  బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రచిన్‌ రవీంద్ర మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సెంచరీ చేశాడు. వరల్డ్‌కప్‌లో మూడు శతకాలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్‌గా రచిన్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. సారధి కేన్‌ విలియమ్సన్‌ జట్టులోకి వచ్చి రావడంతోనే అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. రచిన్‌, విలియమ్సన్‌  పాక్‌ బౌలర్లను ఊచకోత కోసి 180 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేయడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. 
   


ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్‌ డేవన్ కాన్వే, రచిన్‌ రవీంద్ర తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. 39 బంతుల్లో ఆరు ఫోర్లతో 35 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన డేవిడ్‌ కాన్వేను హసన్‌ అలీ అవుట్‌ చేశాడు. హసన్‌ అలీ వేసిన బౌన్సర్‌ను హుక్‌ చేయబోయిన కాన్వే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ ఆనందం పాక్‌కు ఎక్కువసేపు నిలువలేదు. రచిన్‌ రవీంద్రకు జత కలిసిన సారధి కేన్‌ విలియమ్సన్ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. వీరిద్దరూ పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. రన్‌రేట్‌ ఎక్కడా తగ్గకుండా ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలో 88 బంతుల్లోనే రచిన్‌ రవీంద్ర శతకం పూర్తి చేసుకున్నాడు.  వికెట్ల కోసం పాక్‌ బౌలర్లు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు. చివరికి 79 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సులతో 95 పరుగులు చేసి శతకం దిశగా దూసుకుపోతున్న సారధి విలియమ్సన్‌ను ఇఫ్తికార్‌ అహ్మద్‌ అవుట్‌ చేశాడు. దీంతో 180 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 



 అనంతరం కాసేపటికే రచిన్‌ రీవంద్ర కూడా అవుటయ్యాడు. 95 బంతుల్లో 15 ఫోర్లు,  1 సిక్సుతో 108 పరుగులు చేసిన రచిన్‌ను మహ్మద్‌ వసీమ్‌ అవుట్ చేశాడు. భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో రచిన్‌ క్యాచ్‌ అవుటై వెనుదిరిగాడు. తర్వాత డేరిల్‌ మిచెల్‌, మార్క్ చాప్‌మన్‌ కూడా వేగంగా పరుగులు చేసేందుకు యత్నించారు. 18 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్సుతో 29 పరుగులు చేసిన మిచెల్‌ను హరీస్‌ రౌఫ్ బౌల్డ్‌ చేశాడు. అనంతరం మార్క్‌ చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ న్యూజిలాండ్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. 27 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసి ధాటిగా ఆడుతున్న చాప్‌మన్‌ను మహ్మద్‌ వసీమ్ బౌల్డ్ చేశాడు. కానీ గ్లెన్‌ ఫిలిప్‌ మాత్రం పోరాటం ఆపలేదు. కేవలం 25 బంతుల్లోనే 2 సిక్సులు, నాలుగు ఫోర్లతో ఫిలిప్‌ 41 పరుగులు చేశాడు. చివర్లో శాంట్నర్‌ కూడా బ్యాటు ఝుళిపించడంతో  న్యూజిలాండ్‌  నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది.



 ఓ దశలో న్యూజిలాండ్ సునాయసంగా 430కుపైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ పాక్ బౌలర్లు చివరి 15 ఓవర్లలో పుంజుకోవడంతో అది సాధ్యపడలేదు. క్రీజులో కుదురుకుని భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన బ్యాటర్లను పాక్ బౌలర్లు అవుట్‌ చేశారు. దీంతో కివీస్ పరుగుల వేగం తగ్గింది. పాక్ బౌలర్లలో షహీన్‌ షా అఫ్రిదీ 10 ఓవర్లు వేసి 90 పరుగులు సమర్పించుకున్నాడు. షహీన్‌ షా అఫ్రిదీ  ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. మహ్మద్‌ వసీమ్‌ 10 ఓవర్లలలో 60 పరుగులు ఇచ్చి 3 వికెట్లు నేలకూల్చాడు. హసన్‌ అలీ 10 ఓవర్లలలో 82, హరీస్‌ రౌఫట్‌ 10 ఓవర్లలలో 85 పరుగులు ఇచ్చారంటే కివీస్‌ బ్యాటింగ్‌ విధ్వంసం ఎలా సాగిందో తెలుసుకోవచ్చు. 



 ఈ ప్రపంచకప్‌లో ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో కివీస్‌ నాలుగో స్థానంలో ఉండగా..అన్నే మ్యాచులు అడిన పాకిస్థాన్‌ మూడు విజయాలు, నాలుగు పరాజయాలతో అయిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లు ఓడితే పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు పూర్తిగా అంతమవుతాయి. ఒకవేళ న్యూజిలాండ్ ఓడితే సెమీస్‌లో నాలుగో బెర్తు కోసం పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. మిగిలిన రెండు సెమీస్‌ బెర్తులు కీలకంగా మారిన వేళ ఏ జట్టు నిలుస్తుందో.. ఏ జట్టు ఆశలు ముగుస్తాయే ఈ మ్యాచ్‌తో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ తప్పనిసరిగా గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌తో పాటు ఇంగ్లండ్‌పై కూడా గెలిస్తేనే పాక్‌కు నాకౌట్‌ అవకాశాలు ఉంటాయి. లేకపోతే పాక్‌ వెనుదిరగక తప్పదు.