Pak Vs Nz Live Updates: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తొలి ఫలితం వచ్చింది. బుధవారం ఏకపక్షంగా జరిగిన గ్రూప్- ఎ తొలి లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్థాన్ పై 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 320 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ విల్ యంగ్ (113 బంతుల్లో 107, 12 ఫోర్లు, 1 సిక్సర్), టామ్ లాథమ్ (104 బంతుల్లో 118 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో సత్తా చాటారు. బౌలర్లలో నసీమ్ షా, హరీస్ రవూఫ్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో పాక్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ ఖుష్ దిల్ షా మెరుపు ఫిప్టీ (49బంతుల్లో 69, 10 ఫోర్లు, 1 సిక్సర్)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. విల్ ఓ రౌర్క్, మిషెల్ శాంట్నర్ మూడేసి వికెట్లతో సత్తా చాటారు. లాథమ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తర్వతి మ్యాచ్ లో ఈనెల 23న భారత్ తో పాక్ ఆడనుంది.
భారీ భాగస్వామ్యాలు..
బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ కు శుభాంరంభం దక్కలేదు. 73 పరుగులకే కీలకమైన ఓపెనర్ డేవన్ కాన్వే (10), కేన్ విలియమ్సన్ (1), డారైల్ మిషెల్ (10) త్వరగానే పెవిలియన్ కు చేరారు. ఈ దశలో జతకూడిన లాథమ్ తో యంగ్ అద్భుతంగా ఆడాడు. ప్రారంభంలో కాస్త టైం తీసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచారు. ఈక్రమంలో 107 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని, కాసేపటికే యంగ్ ఔటయ్యాడు. దీంతో 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి మెరుపు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 95 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్ కు వీరిద్దరూ 74 బంతుల్లోనే 125 పరుగులు జత చేశారు. దీంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. మిగతా బౌలర్లలో అబ్రార్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది.
టపాటపా..
చేజింగ్ లో పాక్ జట్టుకు ఏదీ కలిసి రాలేదు. ఆరంభంలోనే వికెట్లు కోల్పయి కష్టాల్లో పడింది. ఫఖార్ జమాన్ కు గాయం కావడంతో సౌద్ షకీల్ తో కలిసి మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64, 6 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్ ఆరంభించాడు. కివీస్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఓ దశలో 128 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికి ఫిఫ్టీ తర్వాత బాబర్ కూడా ఔటవడంతో పాక్ కు గెలుపుపై ఆశలు సన్నగిల్లాయి. చివర్లో ఖుష్ దిల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి బ్యాట్ ఝళిపించడంతో జట్టు స్కోరు 260 పరుగులకే చేరుకుంది. మిగతా బౌలర్లలో మ్యాట్ హెన్రీకి రెండు, మైకేల్ బ్రాస్ వెల్, నాథన్ స్మిత్ కు తలో వికెట్ లభించింది. ఈ విజయంతో టోర్నీలో కివీస్ బోణీ కొట్టినట్లు అయింది.