WPL MI Vs GG Result Update: బోణీ కొట్టిన ముంబై.. 5 వికెట్లతో సూపర్ విక్టరీ.. బ్రంట్ మెరుపు ఫిఫ్టీ.. గుజరాత్ కి రెండో పరాజయం
బంతికో పరుగు చేస్తే సులభంగా గెలిచి మ్యాచ్ లో ముంబైకి శుభారంభం దక్కలేదు. హీలీ , యస్తికా త్వరగానే వెనుదిరిగారు. హర్మన్ ప్రీత్ కూడా నాలుగు పరుగులే చేసి పెవిలియన్ కు చేరింది.

Mi Vs GG Latest Updates; డబ్ల్యూపీఎల్ లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. మంగళవారం వడోదరలో జరిగిన లీగ్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై ఐదు వికెట్ల తో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ సరిగ్గా 20 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 32, 4 ఫోర్లు) బంతికో పరుగు చొప్పున సాధించి, టాప్ స్కోరర్ గా నిలిచింది. హీలీ మథ్యూస్ మూడు వికెట్లతో రాణించింది. ఛేదనను 16.1 ఓవర్లలోనే ఐదు వికెట్లకు 122 పరుగులు చేసి ముంబై పూర్తి చేసింది. వన్ డౌన్ బ్యాటర్ నాట్ స్కివర్ బ్రంట్ ఫిఫ్టీ (39 బంతుల్లో 57, 11 ఫోర్లు)తో సత్తా చాటింది. బౌలర్లలో ప్రియా మిశ్రా, కశ్వీ గౌతమ్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. హీలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీలో గుజరాత్ కిది రెండో పరాజయం కావడం గమనార్హం.
వరుసగా వికెట్లు..
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు శుభారంభం దక్కలేదు. 14 పరుగులకే ఓపెనర్లు బేత్ మూనీ, లారా వోల్వర్ట్స్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో హర్లీన్ ఓపికగా ఆడింది. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదింది. ఆమెతోపాటు కశ్వీ గౌతమ్ (20) కాస్త వేగంగా ఆడటంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. చివర్లో తనూజ కన్వర్, సయాలి సాత్ఘరే తలో 13 పరుగులు జోడించి జట్టుక గౌరవ ప్రదమైన స్కోరును అందించారు. బౌలర్లలో బ్రంట్ , అమెలియా కెర్ కు రెండేసి వికెట్లు, షబ్నిం ఇస్మాయిల్, అమన్జోత్ కౌర్ కు ఒక వికెట్ లభించింది.
టాపార్డర్ విఫలం..
బంతికో పరుగు చేస్తే సులభంగా గెలిచి మ్యాచ్ లో ముంబైకి శుభారంభం దక్కలేదు. హీలీ (17), యస్తికా భాటియా (8) త్వరగానే వెనుదిరిగారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా నాలుగు పరుగులే చేసి పెవిలియన్ కు చేరింది. దీంతో 55 పరుగలకు మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రంట్- అమెలియా (19) జంట ఆదుకుంది. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, స్ట్రైక్ రొటేట్ చకచకా చేశారు. అమెలియా బంతికో పరుగు చేసి, బ్రంట్ కు ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చింది. గుజరాత్ బౌలర్లను ఆటాడుకున్న బ్రంట్ తన ఇన్నింగ్స్ లో ఏకంగా 11 ఫోర్లు బాదడం విశేషం. దీంతో 33 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఒక్క ఓవర్ తేడాతో ఆఖర్లో వీరిద్దరూ వెనుదిరిగినా, సజనా, కమలిని జట్టును విజయతీరాలకు చేర్చారు. టోర్నీలో ముంబైకిదే తొలి విజయం కావడం విశేషం. బౌలర్లలో తనూజ కన్వర్ కు ఒక వికెట్ దక్కింది. బుధవారం ఇదే వేదికపై ఢిల్లీ క్యాపిటల్స్ తో యూపీ వారియర్జ్ తలపడనుంది.
Read Also: Viral Video: టోర్నీకి ముందు మా కాళ్లు విరగ్గొడతావా..? నెట్ బౌలర్ తో రోహిత్ సరదా చిట్ చాట్