Viral Video: టోర్నీకి ముందు మా కాళ్లు విరగ్గొడతావా..? నెట్ బౌలర్ తో రోహిత్ సరదా చిట్ చాట్
Rohit Sharma Funny Chat: కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా తదితరులు తమ బ్యాటింగ్ కు పదును పెడుతున్నారు.
Team India Practice Session: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు అక్కడ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపుగా అందరు ప్లేయర్ల కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా తదితరులు తమ బ్యాటింగ్ కు పదును పెడుతున్నారు. ఇక నెట్ సెషన్ లో స్థానిక బౌలర్ అహ్మద్ ను రోహిత్ ప్రశంసించాడు. లెఫ్టార్మ్ పేసరైన అహ్మద్ పదే పదే యార్కర్లు విసురుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. షాహిన్ షా ఆఫ్రిది, ట్రెంట్ బౌల్ట్ ను పోలి ఉండే అతని యాక్షన్ లో యార్కర్లను చూసి రోహిత్ ముచ్చట పడ్డాడు. ట్రైనింగ్ సెషన్ ముగిశాక అతనితో సరదాగా చిట్ చాట్ చేశాడు. ట్రైనింగ్ లోనే తమ కాళ్లు విరగ్గొడతావా..? అని చమత్కారంగా మాట్లాడాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు తమకు తోచిన కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లతో పోస్టు చేస్తున్నారు.
కఠోర శిక్షణ..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని మూడోసారి నెగ్గాలని భారత్ పట్టుదలగా ఉంది. 2002, 2013లో టోర్నీని నెగ్గిన టీమిండియా, 2017లో రన్నరప్ గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా టోర్నీని నెగ్గాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక రెగ్యులర్ వికెట్ కీపర్ గా బరిలోకి దిగుతున్న కేఎల్ రాహుల్ తన హిట్టింగ్ జోరును పెంచాడు. భారీ షాట్లను ఆడుతూ ప్రాక్టీస్ లో కనిపించాడు. హార్దిక్ కూడా పలురకాల షాట్లను ప్రాక్టీస్ చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో రెండు ఫిఫ్టీలు, ఒక సెంచరీతో రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన గిల్.. పుల్ షాట్లు ఆడుతూ కనిపించాడు. రోహిత్ తన ట్రేడ్ మార్కు పుల్ షాట్లు ఆడగా, కోహ్లీ.. బంతిని మిడిల్ చేయడంపై దృష్టి సారించాడు.
బుధవారం నుంచే షురూ..
పాకిస్థాన్ లో బుధవారం నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో పాక్ ఢీకొంటుంది. ఈనెల 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. బారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రీడ్ పద్ధతిలో జరుగుతాయి. ఈనెల 20 బంగ్లాదేశ్, 23న చిరకాల ప్రత్యర్థి, ఆతిథ్య పాక్ , మార్చి 2న న్యూజిలాండ్ తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే జరుగుతాయి. గ్రూపు-ఎలో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ గ్రూపులో భారత్ తో పాటు పాక్, బంగ్లా, కివీస్ ఉన్నాయి. గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్ కు చేరుతాయి.