Rohit Sharma Most Sixes Record: రోహిత్ శర్మ క్రిస్ గేల్  రికార్డ్ ను  తిరగ రాశాడు. భారత్ వేదికగా జరుతున్న ప్రపంచకప్ లో  అత్యధిక సిక్స్ లు కొట్టిన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు  ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరు మీద ఉంది. వరల్డ్‌కప్‌లలో గేల్ 49 సిక్సులు కొట్టగా.. రోహిత్ శర్మ 50 సిక్స్ లు కొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు.


ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతోన్న సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి బరిలోకి దిగిన రోహిత్ అలవోకగా సిక్స్ లు  కొట్టి కొత్త ఉత్సాహాన్ని జోడించాడు.  ప్రపంచ కప్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లలో  50 సిక్స్ లతో  రోహిత్ శర్మ మొదటి స్థానం లో నిలవగా , 49 సిక్స్ లతో  క్రిస్ గేల్ రెండవ స్థానంలోకి పడిపోయాడు. 43 సిక్స్ లతో గ్లెన్ మాక్స్‌వెల్,  37 సిక్స్ లతో  ఏబీ డివిలియర్స్లు తరువాత స్థానంలో ఉన్నారు.  


ఈ వరల్డ్ కప్ లోనే  అంతర్జాతీయ క్రికెట్‌లో 14 వేల పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా రోహిత్  రికార్డు సృష్టించాడు. 14 వేల పరుగులకుపైగా చేసిన మూడో భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు వన్డేలు, టీ20లు, టెస్టులు, ఐపీఎల్‌లో కలిపి 13,988 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల వద్ద 14 వేల మైలురాయిని రోహిత్‌ అందుకున్నాడు. 


అలాగే ఈ ప్రపంచ కప్ లో మరో రికార్డును కూడా రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివీలియర్స్ పేరు మీదున్న రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో సిక్సు కొట్టిన రోహిత్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. 2015లో డివిలియర్స్‌ ఒకే ఏడాదిలో వన్డేల్లో 58 సిక్సర్లు కొట్టాడు. రోహిత్‌ 60 సిక్సులతో ఈ రికార్డును బద్దలు కొట్టాడు.


ఈ ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు జట్టు తుది కూర్పు, మిడిలార్డర్‌ వైఫల్యం వంటి సమస్యలతో కనిపించిన రోహిత్‌ సేన.. బరిలోకి దిగాక మాత్రం అంచనాలను మించి రాణిస్తోంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. గత నెల ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రోహిత్‌సేన ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌ల ప్రస్థానం... నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ వరకు నిరాటంకంగా సాగింది. ఇక ఇప్పుడు తొలి సెమీస్ జరుగుతున్న వాంఖేడే స్టేడియం ఈ పిచ్‌పై పరుగుల వరద ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే పిచ్‌..మ్యాచ్‌ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి టాస్‌ గెలిచిన భారత జట్టు  బ్యాటింగ్‌ తీసుకుంది.  ప్రపంచకప్‌ మ్యాచుల్లోనూ వాంఖడే పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ దక్షిణాఫ్రికా రెండు సార్లు భారీ స్కోర్లు నమోదు చేసింది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు ఉన్నా సెమీస్‌ ఫోబియా అభిమానులను కలవరపెడుతోంది.  ICC  టోర్నీల్లో భారత్‌పై కివీస్‌కు ఘనమైన రికార్డు ఉన్నా ఈ మ్యాచ్‌లో వాటన్నింటినీ పటాపంచలు చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గత ప్రపంచకప్‌ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ఈ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన కసిగా ఉంది.