WPL MI VS RCB Updates: డ‌బ్ల్యూపీఎల్ 2025 నాకౌట్ మ్యాచ్ ల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. తాజాగా ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఓట‌మిపాల‌వ్వ‌డంతో గుజ‌రాత్ జెయింట్స్ జ‌ట్టు ఎలిమినేట‌ర్ మ్యాచ్ కు అర్హత సాధించింది. ఇక మంగ‌ళ‌వారం మంబై ఇండియ‌న్స్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మధ్య మ్యాచ్ తో ఫైన‌ల్లో అడుగుపెట్టేది ఎవ‌రో తెలియ‌నుంది. ఇప్ప‌టికే ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు ప‌ది పాయింట్ల‌తో ప్లే ఆఫ్స్ లోకి ప్ర‌వేశించింది. ఇక గుజ‌రాత్ పై గెలుపుతో, ప‌ది పాయింట్ల‌తోనే ముంబై ఉన్నా, ఆర్సీబీపై గెలుస్తేనే నేరుగా ఫైన‌ల్లోకి అడుగుపెడుతుంది. అయితే ఢిల్లీ కంటే నెట్ ర‌న్ రేట్ విష‌యంలో ముంబై వెనుక‌బ‌డి ఉండటంతో సొంత‌గ‌డ్డ ముంబై లో ఆర్సీబీ తో జ‌రిగే చివ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబై గెల‌వ‌డం త‌ప్ప‌నిస‌రి. ఆ మ్యాచ్ లో ఓడిపోతే మాత్రం ఢిల్లీ నేరుగా ఫైన‌ల్లోకి ప్రవేశిస్తుంది. 


ఐపీఎల్ కు భిన్నంగా.. 
 ఐపీఎల్లో మాదిరిగా ఇందులో క్వాలిఫ‌య‌ర్ -1, క్వాలిఫ‌య‌ర్-2  మ్యాచ్ లు ఉండ‌వు. లీగ్ ద‌శ‌లో టాప్ లో నిలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్లోకి ప్ర‌వేశిస్తుంది. రెండు, మూడు స్థానాలు సాధించిన జ‌ట్లు.. ఎలిమినేట‌ర్ మ్యాచ్ కు అర్హత సాధిస్తాయి.. ఆ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్లో లీగ్ టాప‌ర్ తో టైటిల్ కోసం పోరాడుతుంది. ప్ర‌స్తుతం ఢిల్లీ, ముంబై టాప్-2లో ఉండ‌గా, మంగ‌ళ‌వారం మ్యాచ్ ఎంఐకి కీల‌కంగా మారింది. ఇక డిఫెండింగ్ చాంపియ‌న్ ఆర్సీబీ, యూపీ వారియ‌ర్జ్ చెత్త ఆటతీరుతో ఇప్ప‌టికే టోర్నీ నాకౌట్ రేసు నుంచి నిష్క్ర‌మించాయి. 


అద్భుత విజ‌యం సాధించిన ముంబై..
ముంబైలో సోమ‌వారం జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ జెయింట్స్ పై ముంబై ఉత్కంఠ‌భ‌రిత విజ‌యం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల‌కు 179 ప‌రుగులు చేసింది. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (33 బంతుల్లో 54, 9 ఫోర్లు) తో స‌త్తా చాటింది. ఆమెతోపాటు వ‌న్ డౌన్ బ్యాట‌ర్ నాట్ స్కీవ‌ర్ బ్రంట్ (38), హీలీ మ‌థ్యూస్‌, అమ‌న్ జ్యోత్ కౌర్ చెరో 27 ప‌రుగుల‌తో స‌త్తా చాటారు. బౌల‌ర్ల‌లో త‌నూజ క‌న్వ‌ర్, క‌శ్వీ గౌతం, ప్రియా మిశ్రా, కెప్టెన్ యాష్లీ గార్డెన‌ర్ కు త‌లో వికెట్ ద‌క్కింది. అనంత‌రం ఛేద‌న‌లో గుజ‌రాత్ స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో 170 ప‌రుగులకు ఆలౌటై, 8 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. భార‌త ఫుల్ మ‌లి విధ్వంస‌క‌ర ఫిఫ్టీ (25 బంతుల్లో 61, 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)తో జ‌ట్టు విజ‌యానికి ప్ర‌య‌త్నించి, విఫ‌ల‌మైంది. ఓపెన‌ర్ హ‌ర్లీన్ డియోల్ (24), ఫోబ్ లిచ్ ఫీల్డ్ (22)ల‌కు శుభారంభాలు ద‌క్కినా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయారు. బౌల‌ర్ల‌లో హీలీ మ‌థ్యూస్, అమెలియా కెర్  కు మూడు వికెట్లు ద‌క్కాయి. ష‌బ్నిమ్ ఇస్మాయిల్ కి రెండు, సంస్కృతి గుప్తాకు ఒక వికెట్ ద‌క్కింది. ఒక‌వేళ ఈ మ్యాచ్ లో గుజ‌రాత్ గెలిచి ఉంటే, ఢిల్లీతో ఫైన‌ల్ పోరుకి సిద్ధ‌మ‌య్యేది, కానీ ఓట‌మితో ఎలిమినేట‌ర్ మ్యాచ్ కు అర్హ‌త సాధించింది.