2011 WC Victory Memorial: టీమిండియా మాజీ సారథి , ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ గా ఉన్న మహేంద్రసింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. భారత జట్టుకు మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ఈ జార్ఖండ్ డైనమైట్‌కు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ఐపీఎల్ - 16లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన అతడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. 2011లో వన్డే వరల్డ్ కప్ సందర్భంగా విన్నింగ్ షాట్ కొట్టిన ధోనికి.. ఆ బంతి పడ్డ చోటును ‘2011 వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్’గా మార్చింది.
ముంబైతో మ్యాచ్ ఆడేందుకు గాను వాంఖడేకు వచ్చిన ధోని.. ‘వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్’ను ప్రారంభించాడు. 2011 వన్డే వరల్డ్ కప్ విజయం జ్ఞాపకార్థం ఎంసీఎ ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమంలో ధోనితో పాటు ఎంసీఎ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా భారత్ 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచి ఇటీవలే 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో భారత్.. ఐదు వికెట్లు కోల్పోయి ఘన విజయాన్ని అందుకున్నది. తద్వారా 28 ఏండ్ల తర్వాత రెండో వన్డే వరల్డ్ కప్‌ను అందుకుంది.
అప్పుడు ఏం జరిగింది..?
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 రన్స్ చేసింది. మహేళ జయవర్దెనే (103) సెంచరీతో రాణించగా.. దిల్షాన్ (48), కులశేఖర (32) రాణించారు. లక్ష్య ఛేదనలో భారత్ కు ఆదిలోనే డబుల్ షాకులు తాకాయి. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ అవగా సచిన్ టెండూల్కర్ 18 పరుగులే చేశాడు. కానీ మూడో వికెట్‌కు విరాట్ కోహ్లీ (35) తో కలిసి గౌతం గంభీర్ (97) 83 పరుగులు జోడించాడు.
కోహ్లీ ఔటయ్యాక వచ్చిన ధోని (91 నాటౌట్).. గంభీర్ తో నాలుగో వికెట్ కు 109 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. మరో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా నువాన్ కులశేఖర వేసిన 48వ ఓవర్లో లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ పడ్డ చోటునే ప్రస్తుతం ఎంసీఎ.. ‘వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్’ను నిర్మించి దానిని ధోనితో ప్రారంభించింది.
కాగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ లో ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణించే ఈ మ్యాచ్ లో నెగ్గేందుకు ఇరు జట్లూ తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్ లో ముంబై - చెన్నైల నడుమ 34 మ్యాచ్ లు జరుగగా ముంబై 20 మ్యాచ్ లలో గెలవగా చెన్నై 14 సార్లు విజయం సాధించింది. మరి నేటి పోరులో విజేత ఎవరో..!