India head coach:  టీమిండియా(Team india) నూతన కోచ్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ధోనీ(MS Dhoni) ఇచ్చే సలహానే కీలకంగా మారనుంది. కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్‌ సిద్ధంగా లేకపోవడంతో అతని స్థానంలో కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ సమాలోచనలు జరుపుతోంది.


అయితే టీమిండియా కొత్త కోచ్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై మిస్టర్ కూల్‌ ధోనీ సలహా తీసుకోవాలని బీసీసీఐ(BCCI) భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ద్రవిడ్‌ స్థానంలో చెన్నై కోచ్‌గా ఉన్న స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(Stephen Fleming )కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 303 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్లెమింగ్‌గు ఐపీఎల్‌లో ఎక్కువ కాలం కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే టీ 20 ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఫ్లెమింగ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్‌ కోచ్‌గా చేరేందుకు ఫ్లెమింగ్‌ సిద్ధంగా లేనట్లు సమాచారం.


2009 నుంచి చెన్నై జట్టులో భాగంగా ఉన్న ఫ్లెమింగ్‌... వివిధ టీ20 లీగుల్లో ఫ్రాంచైజీ యాజమాన్యంలోని వివిధ జట్లకు కోచ్‌గా పనిచేస్తున్నాడు. IPLలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్న ఫ్లెమింగ్‌.. మేజర్ లీగ్ క్రికెట్ (USA)లో టెక్సాస్ సూపర్ కింగ్స్, దక్షిణాఫ్రికాలో జరిగే SA20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు కూడా కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ది హండ్రెడ్‌లోని సదరన్ బ్రేవ్‌కి కూడా ఫ్లెమింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. నాలుగు వేర్వేరు లీగ్‌లలో నాలుగు వేర్వేరు ఫ్రాంచైజీలతో సంబంధం కలిగి ఉన్న ఫ్లెమింగ్... కుటుంబంతో ఇప్పటికే సరైన సమయాన్ని గడపలేక పోతున్నాడు. ఒకవేళ బీసీసీఐ ఆఫర్‌ను అంగీకరిస్తే ఐపీఎల్‌లో రెండు నెలలు మినహా దాదాపు ఏడాది మొత్తం ప్రయాణలతోనే సరిపోతుందని... దీనివల్ల కుటుంబానికి సమయం కేటాయించే సమయం తగ్గిపోతుందని ఫ్లెమింగ్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోచ్‌గా తన పేరు చర్చకు వచ్చినప్పుడే తనకు ఇష్టం లేదని ఫ్లెమింగ్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. 


మరో ఇద్దరి పేర్లు కూడా?
ఫ్లెమింగ్‌ నిర్ణయంతో బీసీసీఐ ఇతర ఆటగాళ్ల వైపు దృష్టి సారించింది. జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, మహేల జయవర్ధనేల పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. వారితో చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఫ్లెమింగ్‌ను వదులుకోవడానికి బోర్డు సిద్ధంగా లేదు. ధోనీని మధ్యవర్తిగా చర్చలు నడిపి ఫ్లెమింగ్‌ను ఒప్పించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. టీమిండియా కోచ్‌ పదవికి ఫ్లెమింగ్ నో చెప్పలేదని.. కాంట్రాక్ట్ పదవీకాలంపై మాత్రమే ఆందోళన వ్యక్తం చేశాడని.. ఇది అసాధారణమేమీ కాదని  బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. రాహుల్ ద్రవిడ్ కూడా కోచ్‌ పదవిపై ఆరంభంలో ఆసక్తి చూపలేదని... కానీ తర్వాత అతనిని ఒప్పించారని... ఫ్లెమింగ్‌ విషయంలోనూ అదే జరగవచ్చని ఆ అధికారి గుర్తు చేశారు.  ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ, ఫ్లెమింగ్ సన్నిహితంగా ఉన్నారని.. ధోనీ చెప్తే ఫ్లెమింగ్‌ తప్పకుండా ఒప్పుకుంటారని బీసీసీఐ భావిస్తోంది. ధోనీ-ఫ్లెమింగ్‌ మధఅయ బలమైన బంధం ఉంది. మైదానం వెలుపల కూడా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటారు. ఫ్లెమింగ్‌ను ఎవరైనా ఒప్పించగలిగితే అది ధోనియేనని బీసీసీఐలోని కీలక అధికారులు భావిస్తున్నారు.