Indian Cricket Team:
విరాట్ కోహ్లీ లేదంటే రోహిత్ శర్మ! ఏటా టీమ్‌ఇండియా తరఫున అత్యధిక పరుగుల వీరుల జాబితా తెరిస్తే కనిపించే మొదటి పేర్లు వీరివే. అలాంటిది యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఈసారి వీరిని డామినేట్ చేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో మోస్ట్ రన్ గెట్టర్‌గా అవతరించాడు. కేవలం టీమ్‌ఇండియాలోనే కాదు మిగతా దేశాల వారితో పోల్చినా అతడే ముందుంటున్నాడు. తనదైన రీతిలో దూసుకుపోతున్నాడు. తనకు తిరుగులేదని చాటుతున్నాడు.
డిపెండబుల్‌గా మార్పు
టీమ్‌ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది అదరగొడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. సెంచరీలు, డబుల్ సెంచరీలతో దూసుకుపోతున్నాడు. ఎక్కడ పర్యటించినా చక్కని బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. భారత భవిష్యత్తుకు ఆశాదీపంగా మారుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది 30 మ్యాచులు ఆడిన శుభ్‌మన్ 46.93 సగటు, 100.74 స్ట్రైక్‌రేట్‌తో 1346 పరుగులు సాధించాడు. 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు బాదేశాడు. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అతడి డబుల్ సెంచరీ (208)ని ఎవరూ మర్చిపోలేరు. 150 చేసేంత వరకు కుదురుగా ఆడిన అతడు ఆపైన రెచ్చిపోయాడు. నిమిషాల్లో ద్విశతకం అందుకొని మురిపించాడు. మళ్లీ అదే న్యూజిలాండ్‌పై ఐదో టీ20లో 126 నాటౌట్‌తో చెలరేగాడు.
హిట్‌మ్యాన్ అద్భుతమే
ఈ ఏడాది శుభ్‌మన్ గిల్ తర్వాత అత్యధిక పరుగులు చేసింది కెప్టెన్ రోహిత్ శర్మ. 18 మ్యాచుల్లో 50.40 సగటు, 74.61 స్ట్రైక్‌రేట్‌తో 1008 పరుగులు సాధించాడు. 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు బాదేశాడు. అతడీ ఏడాది ఒక్క టీ20 ఆడకపోవడం గమనార్హం. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉండాలని హిట్‌మ్యాన్ భావించాడు. అందుకే టీ20ల నుంచి తప్పుకున్నాడు. బిగ్ టార్గెట్‌పైనే ఫోకస్ చేశాడు. ఇక న్యూజిలాండ్‌పై టెస్టుల్లో, వన్డేల్లో ఒక్కో సెంచరీ కొట్టాడు. వెస్టిండీస్ టెస్టులోనూ ఓ శతకం బాదేశాడు. ఆసియాకప్‌లో నేపాల్ మీద మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
కోహ్లీపై అంచనాలు
దశాబ్ద కాలంగా టీమ్‌ఇండియాకు రన్ మెషీన్‌గా అవతరించాడు విరాట్ కోహ్లీ. ప్రతి సంవత్సరం ఒకటి, రెండు స్థానాల్లో ఉంటాడు. అలాంటిది ఈ సారి మూడుకు తగ్గాడు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీ20లకు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో కేవలం 19 మ్యాచులే ఆడాడు. 52 సగటు, 67.90 స్ట్రైక్‌రేట్‌తో 988 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. జనవరిలో శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో రెండు సెంచరీలు బాదాడు. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాపై టెస్టు శతకం (186) నమోదు చేశాడు. తాజాగా వెస్టిండీస్ టెస్టులోనూ ఓ సెంచరీ అందుకున్నాడు. ఆసియా, వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి.
వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial