Travis Head - Mohammed Siraj Controversy : అప్పుడు.. మీకు మంకీగేట్(Monkeygate) వివాదం గుర్తుందా.. అప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన ఘటన అది. హర్భజన్(Harbhajan Singh) -సైమండ్స్ మధ్య జరిగిన ఆ గొడవ.. ఇటు భారత జట్టును.. అటు ఆస్ట్రేలియా టీంను ఆ ఘటన తీవ్ర వివాదంలోకి లాగేసింది. అనిల్ కుంబ్లే సారథ్యంలో జరిగిన ఆ ఘటన క్రికెట్ లో ఓ మాయని మచ్చ. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ ఘటనపై సాక్ష్యం కూడా ఇవ్వడం విశేషం.

 

ఇప్పుడు..  బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ పరాజయం పాలైంది. అయితే ఈ టెస్టులో ఆసీస్‌ బ్యాటర్ ట్రావిస్ హెడ్(Travis Head) సిరాజ్( Mohammed Siraj) మధ్య మాటల యుద్ధం జరిగింది. హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాక సిరాజ్‌ సంబరాలు చేసుకుంటూ సైగలు చేశాడు. హెడ్‌ మాత్రం తాను ‘వెల్ బౌల్డ్’ అన్నప్పటికీ సిరాజ్‌ తప్పుగా అర్థం చేసుకున్నాడంటూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు. సిరాజ్ కు తన భాష అర్థం కాలేదని హెడ్ అన్నాడు. అయితే హెడ్ వ్యాఖ్యలను సిరాజ్ ఖండించాడు.

తాను హెడ్ కు బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తానని సిరాజ్ అన్నాడు. అయితే తమ ఇద్దరి మధ్య గ్రౌండ్ లో రణం జరుగుతుందని... ఓ మంచి బంతిని సిక్స్‌గా బాదితే ఏ బౌలర్‌కైనా బాధగానే ఉంటుందని సిరాజ్ అన్నాడు. అందుకే హెడ్ అవుటైన తర్వాత తాను సంబరాలు చేసుకున్నా అని అన్నాడు. కానీ హెడ్‌ చాలా అబద్ధాలు చెప్పాడని సిరాజ్ అన్నాడు. ‘వెల్ బౌల్డ్‌’ అన్నానంటూ హెడ్ చేసిన కామెంట్లలో ఎలాంటి వాస్తవం లేదని సిరాజ్ మియా స్పష్టం చేశాడు. క్రికెట్ జెంటిల్‌మన్ గేమ్ అని.. . కానీ హెడ్ ప్రవర్తన మాత్రం చాలా తప్పని సిరాజ్‌ అన్నాడు.

 


 

మంకీ గేట్ వివాదం కూడా ఇలాంటిదే.. 

 

2008లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం అనిల్ కుంబ్లే సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ సిరీస్ సమయంలో  హర్భజన్ సింగ్ తనను మంకీ అన్నాడని.. .కంగారు దిగ్గజ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలను టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. తాను మంకీ అని అనలేదని అన్నాడు. ఇది చినికిచినికి గాలివానలా మారిపోయింది.  వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు పిచ్ లోనే ఉన్న సచిన్ భజ్జీకి మద్ధతుగా నిలిచాడు. ఈ వివాదంపై విచారణ కూడా జరిగింది. హర్భజన్ కు మద్దతుగా సచిన్ సాక్ష్యం చెప్పాడు.

 

ఆస్ట్రేలియా మీడియా మాత్రం భారత జట్టును.. ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని కథనాలను వండివార్చింది. కుంబ్లే కెప్టెన్సీలోని భారత జట్టు మొత్తం  హర్భజన్ సింగ్‌కి పూర్తిగా మద్దతు పలికింది. హర్భజన్ పై విధించిన నిషేధం ఎత్తివేయకపోతే, ఆసీస్ పర్యటన రద్దు చేసుకుంటామని హెచ్చరించింది. దీంతో టీమిండియా డిమాండ్‌కి తలొగ్గిన ఆస్ట్రేలియా జట్టు, హర్భజన్‌ సింగ్‌పై నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ వివాదంపై ఆ మ్యాచ్ రిఫరీ మైక్ ప్రోక్టర్ కూడా ఈ వివాదంలో హర్భజన్ సింగ్‌దే తప్పని ఆరోపించాడు. మంకీ గేట్ వివాదం తర్వాత ఓ క్రికెటర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నాడని మరో క్రికెటర్ ఆరోపించడంతో కలకలం రేగింది.