IND vs AUS Adelaide Test: బోర్డర్- గావస్కర్ టెస్టు సిరీస్ లో భారత్ కు తొలి పరాజయం ఎదురైది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో డే/నైట్ టెస్టులో భారత్ పది వికెట్ల తేడాతో ఘెర పరాజయం పాలైంది. ఆదివారం మూడోరోజు ఓవర్ నైట్ స్కోరు 128/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 175 పరుగులకే కుప్పకూలింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (47 బంతుల్లో 42, 6 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. 36.5 ఓవర్లలో ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాల్ తో జట్టును ముందుండి నడిపించాడు. 57 పరుగులకు ఐదు వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. స్కాట్ బోలాండ్ కు మూడు, మిషెల్ స్టార్క్ కి రెండు వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కు కేవలం 19 పరుగుల స్పల్ప టార్గెట్ ను ఆసీస్ ముందు భారత్ ఉంచింది. 3.2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా కంగారూలు ఈ టార్గెట్ ను సునాయాసంగా ఛేదించారు.
బ్యాటర్ల మూకుమ్మడి వైఫల్యం..
బ్యాటింగ్ కాస్త అనుకూలంగా ఉన్న పిచ్ పై భారత బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. మరోవైపు అలవాటు లేని పింక్ బంతితో ఫ్లడ్ లైట్ల వెలుగులో మ్యాచ్ ఆడాల్సి రావడం కూడా జట్టు ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కిందటిసారి పర్యటనలో కూడా అడిలైడ్ లో జరిగిన డే/నైట్ టెస్టులో భారత్ పరాజయం పాలైంది. అప్పుడైతే అవమానకరంగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులకే కుప్పకూలింది.
జట్టు కూర్పు కలిసి రాలేదా..?
పెర్త్ లో జరిగిన మొదటి టెస్టులో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్.. ఈ మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులు చేసింది. దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ స్తానంలో శుభమాన్ గిల్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చారు. గిల్ రెండు ఇన్నింగ్స్ లలో ఫర్వాలేదనిపంచగా, రోహిత్, అశ్విన్ మాత్రం విఫలమయ్యారు. ముఖ్యంగా ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన రోహిత్.. 3, 6 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు. గత కొంతకాలంగా తను విఫలమవుతున్నాడు. వీలైనంత త్వరగా బ్యాట్ తో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఆల్ రౌండర్ అశ్విన్ అటు బ్యాటింగ్ లో విఫలం కాగా, ఇటు బౌలింగ్ లో ఒక వికెట్ మాత్రమే సాధించాడు. ఇక బౌలింగ్ లో బుమ్రా అదరగొడుతుండగా,, సిరాజ్ ఫర్వలేదనిపించాడు. హర్షిత్ రాణా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. ఆల్ రౌండర్ కోటాలో ఆడుతున్న నితీశ్ అటు బ్యాట్ తో ఇటు బాల్ తోనూ సత్తా చాటుతున్నాడు. బ్రిస్బేన్ లో జరిగే మూడో టెస్టుకు ముందు జట్టు కూర్పులో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాట్స్ మెన్ పరుగులు సాధిస్తేనే సిరీస్ లో ముందంజ వేసే అవకాశముంది. ఈ సిరీస్ లో గెలుపొందితేనే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో తుదిపోరుకు భారత్ అర్హత సాధించే అవకాశముంది.
Also Read: Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు