Adelaide Test: అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో ఓడిన తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడానికి భారత అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. బ్యాటర్ల వైఫల్యంతో ఈ మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. అసలే రెండో టెస్టు ఓడిన బాధలో ఉన్న అభిమానులు.. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ను చూసి షాకయ్యారు. ఇప్పటివరకు టాప్  ర్యాంకులో ఉన్న భారత్.. తొలిసారిగా మూడో స్థానానికి దిగజారింది. పింక్ బాల్ టెస్టులో తన వాడిని మరోసారి ప్రపంచానికి చాటిన కంగారూలు.. పట్టికలో టాప్ ప్లేసును దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా రెండో స్థానంలో నిలిచారు. 


ఫైనల్ చేరాలంటే  ఎలా..?
భారత్ చేతిలో ఇప్పటికీ మూడు మ్యాచ్ లు ఉన్నాయి. అయితే అవన్నీ ఆసీస్ తోనే జరుగుతుండటం విశేషం. ఈనెల 14న బ్రిస్బేన్ లో మూడో టెస్టు, 26న మెల్ బోర్న్ లో నాలుగోదైన బాక్సింగ్ డే టెస్టు, జనవరి 3న సిడ్నీలో చివరిదైన ఐదో టెస్టును భారత్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ ను దక్కించుకుంటేనే భారత్ ఫైనల్  కు అర్హత సాధిస్తుంది. మరి ఆ సమీకరణాలేంటో చూద్దామా మరి..






సమీకరణం-1 : ఆస్ట్రేలియాపై 4-1తో విజయం
ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే సిరీస్ ను 4-1తో రోహిత్ సేన గెలుపొందాల్సి ఉంటుంది. ఇలా గెలవాలంటే భారత్ అసాధారణంగా ఆడాల్సి ఉంటుంది. అంటే వరుసగా మూడు టెస్టులు గెలిస్తే దర్జాగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. దీంతపాటే ఆసీస్ ఫైనల్ పోరు నుంచి నిష్క్రమిస్తుంది. అయితే సొంతగడ్డపై ఆసీస్ ను ఇంతా భారీ మార్జిన్ తో గెలవాలంటే చాలా కష్టం.


సమీకరణం-2: 3-1తో ఆసీస్ పై విజయం
మిగతా మూడు మ్యాచ్ ల్లో రెండు గెలుపొంది, ఒకదాన్ని డ్రాగా ముగించిన చాలు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటుంది. అయితే దీనికి కొన్ని సమీకరణాలు కలిసి రావాలి. శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టులో  సౌతాఫ్రికా విజయం సాధించకుడదు. అంటే లంక గెలుపొందడం లేదా ఆ మ్యాచ్ ను డ్రాగా ముగించడం ఏదోటి జరగాలి. అయితే లంక ఓడిపోతే, భారత్ కు అవకాశాలు ఇంకా క్లిష్టమవుతాయి. మ్యాచ్ డ్రా అయినా ఇండియాకు చాన్స్ ఉంటుంది.



సమీకరణం-3: 3-2తో ఆసీస్ పై విజయం
ఆస్ట్రేలియాపై 3-2తో సిరీస్ గెలిచినప్పటికీ డబ్ల్యూటీసీ తుదిపోరుకు భారత్ అర్హత సాధించడం కొన్ని సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియాతో జనవరిలో జరిగే రెండు టెస్టుల సిరీస్ ను కనీసం లంక డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకట్రెండు టెస్టులు గెలిచినా ఇంకా సూపర్. దీంతో భారత్ నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా/శ్రీలంకతో తలపడే అవకాశముంటుంది. 






సమీకరణం-4: 2-2తో ఆసీస్ తో సిరీస్ డ్రా
ఒకవేళ టీమిండియా లక్కు బాలేక సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన అప్పుడు కచ్చితంగా రెండు సమీకరణాలు అనుకూలంగా ఉంటేనే భారత్ ముందడుగు వేస్తుంది. శ్రీలంకపై టెస్టు సిరీస్ ను 2-0తో సౌతాఫ్రికా గెలవాలి. అలాగే ఆసీస్ పై టెస్టు సిరీస్ ను 2-0తో లంక గెలవాలి. అప్పుడే ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ కి భారత్ అర్హత సాధిస్తుంది. మొత్తం మీద అన్ని సమీకరణాల కంటే కూడా 4-1తో సిరీస్ ను చేజిక్కించుకుంటేనే అటు డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరడంతోపాటు ఆసీస్ ను సొంతగడ్డపై మూడోసారి ఓడించామన్న సంతృప్తి భారత ఆటగాళ్లలో ఉంటుంది. వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కు అదో టానిక్ ల పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


Also Read: Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్