Rohit Sharma News: బ్రిస్బేన్ టెస్టులో టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తప్పు చేశాడని ఆసీస్ మాజీ బ్యాటర్ మథ్యూ హేడెన్ అన్నాడు. నిజానికి బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేయకపోవడం తప్పని, ఇప్పటికే ఈ విషయంలో ఆసీస్ ముందంజలో ఉందని చెప్పాడు. ఓవర్ కాస్టు కండీషన్లు, పిచ్‌పై గడ్డి ఉండటం చూసి రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ కేవలం 13.2 ఓవర్లే సాధ్యమైంది. 


హేడెన్ సొంతగడ్డ బ్రిస్బేన్..
నిజానికి బ్రిస్బేన్ గురించి హేడెన్‌కు తెలిసినంతగా మరెవరికి తెలియదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్వీన్స్లాండ్‌లోని కింగారోయ్ ప్రాంతానికి చెందిన హేడెన్‌కు బ్రిస్బేన్ సొంతగడ్డ లాంటింది. అలాగే ఇక్కడి గ్రౌండ్‌పై కూడా అతనికి చక్కటి రికార్డు ఉంది. ఇప్పటివరకు తన కెరీర్లో 900కు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉండటం విశేషం. ఇక 60కిపైగా సగటుతో హేడెన్ పరుగులు సాధించాడు. అందుకే రోహిత్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని నొక్కివక్కాణిస్తున్నాడు. ఇక ఈ టెస్టులో ఆసీసే గెలిచే అవకాశముందని హేడెన్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అడిలైడ్ టెస్టు గెలిచి మంచి ఊపుమీద కంగారూలు ఉన్నారని, ఇక్కడ కూడా గెలిచి సిరీస్ లో ముందంజ వేస్తారని వ్యాఖ్యానించాడు. 


సిడ్నీలోనే భారత్‌కు చాన్స్..
మరోవైపు బ్రిస్బేన్‌తోపాటు నాలుగో టెస్టు వేదికైన మెల్బ్రోర్న్ లోనూ ఆసీస్ సత్తా చాటుతుందని హేడెన్ తెలిపాడు. బాక్సింగ్ డే (డిసెంబర్ 26)న ప్రారంభమయ్యే ఈ టెస్టు అంటే కంగారూలకు ఎంతో సెంటిమెంటని, ఈ మ్యాచ్ లో ఆసీస్ ప్లేయర్లు సత్తా చాటుతారని జోస్యం చెప్పాడు. ఇక జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టులో భారత్‌కు అవకాశాలుంటాయని తెలిపాడు. ఇక, అందరూ అనుకున్నట్లుగానే భారత్ రెండు మార్పులతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. విఫలమవుతున్న పేసర్ హర్షిత్‌ను అనుకున్నట్లుగానే పక్కన పెట్టిన భారత టీం మేనేజ్మెంట్, అతని స్థానంలో ఆకాశ్ దీప్‌ను జట్టులోకి తీసుకుంది. ఇక రెండో టెస్టులో విఫలమైన భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆశ్చర్యకరంగా రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకుంది. నిజానికి వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుంటారని భావించినా, బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు గతంలో ఇక్కడ రాణించిన అనుభవం జడేజాకు ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్ అతని వైపే మొగ్గినట్లు తెలుస్తోంది. 


ఓవర్ కాస్ట్ కండీషన్లతో పాటు ప్రారంభంలో బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాతో భారత కెప్టెన్ రోహిత్ టాస్ నెగ్గినా, అతను అనుకున్నట్లుగా తొలి 13 ఓవర్లలో ఆసీస్ వికెట్లేమీ కోల్పోలేదు. నాథన్ మెక్ స్విన్నీ (4 బ్యాటింగ్), ఉస్మాన్ ఖవాజా (18 బ్యాటింగ్)తో భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. తొలిరోజు ఆట ముగిసే సరికి ఆసీస్ వికెట్లేమీ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. బౌలర్లు కూడా చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ స్టంప్ లైన్‌లో బౌలింగ్ వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. బౌలర్ స్కాట్ బోలాండ్ స్థానంలో జోష్ హేజిల్ వుడ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బ్రిస్బేన్‌లో రాబోయే మూడు రోజులు వర్షం కురుస్తుందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం వరకు వర్షం మ్యాచ్‌కు అడ్డు కలిగించే అవకాశముందని పేర్కొంది. 


Also Read: Virat Kohli  Record: సచిన్ సరసన కోహ్లీ, ఎలైట్ క్లబ్ లోకి ప్రవేశం- ఆసీస్ పై ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఘనత