Match Fixing In T20 World Cup: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup 2024)లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌(Match Fixing) ఆరోపణలు మరోసారి సంచలనం రేపాయి. లీగ్‌ దశ మ్యాచ్‌లు జరుగుతున్న వేళ గయానాలో ఫిక్సర్లు.. ఓ ఆటగాడిని సంప్రదించారన్న వార్తలు క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. ఈ వార్తలతో మరోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. టీ 20 ప్రపంచకప్‌ జరుగుతున్న వేళ కెన్యా మాజీ అంతర్జాతీయ ఆటగాడు.. ఉగాండా ఆటగాడిని సంప్రదించాడన్న వార్తలు వచ్చాయి. అయితే ఉగాండ ఆటగాడు ఈ విషయాన్ని ఐసీసీ  అవినీతి నిరోధక విభాగానికి చేరవేశాడని తెలుస్తోంది.


 

ఏం జరిగిందంటే...

గయానాలో జరిగిన లీగ్ మ్యాచ్‌ల సందర్భంగా కెన్యా మాజీ పేసర్.. ఉగాండా జట్టు సభ్యుడిని వేర్వేరు ఫోన్‌ నంబర్ల నుంచి పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై పూర్తి అప్రమత్తతో ఉన్న ఐసీసీ అవినీతి నిరోధక ప్రోటోకాల్‌ను అనుసరించిన ఉగాండ ఆటగాడు.. ఆన్‌లైన్ ద్వారా ఐసీసీకి ఈ విషయంపై కంప్లైంట్‌ చేశాడు. ఈ పరిణామంతో వెంటనే అప్రమత్తమైన ఐసీసీ వర్గాలు.. కెన్యా మాజీ ఆటగాడి గురించి అన్ని జట్లను హెచ్చరించాయి. దీంతో అతడిపై చర్యలు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ ఫిక్స్‌ చేయాలనుకునే వారు ఉగాండా జట్టుకు చెందిన ఆటగాడిని టార్గెట్ చేయడంలో ఆశ్చర్య పోవాల్సిన పనేమీ లేదని... పెద్ద జట్లతో పోలిస్తే చిన్న జట్టు ఆటగాళ్లు త్వరగా ఫిక్సర్లు ఉచ్చుకు చిక్కుతారని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పేదరికం కారణంగా చాలామంది ఆటగాళ్లను ఫిక్సర్లు లక్ష్యంగా చేసుకుంటారని.... కానీ ఉగాండ ఆటగాడు ఈ విషయంలో తమను త్వరగా సంప్రదించి గొప్ప పని చేశారని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ICC అవినీతి నిరోధక నిబంధనల ప్రకారం మ్యాచ్ ఫిక్సింగ్, గేమ్‌పై బెట్టింగ్, అంతర్గత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, విచారణకు సహకరించకపోవడం తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. 

 

వాళ్లే టార్గెట్‌

 

 మ్యాచ్‌ ఫిక్సర్లు ఎప్పుడూ చిన్న జట్ల ఆటగాళ్లనే సంప్రదిస్తారని... టీ 20 ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌లలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఆట సమగ్రతను కాపాడే ప్రయత్నంలో భాగంగా అవినీతిని క్రికెట్‌ నుంచి పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశోధించడానికి పాలకమండలి, సభ్య బోర్డులకు పూర్తి అధికారం కల్పించినట్లు ఇటీవల ఐసీసీ వెల్లడించింది. ఆటగాడు, కోచ్, శిక్షకుడు, మేనేజర్, సెలెక్టర్, అధికారి, డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, మ్యాచ్ రిఫరీ, పిచ్ క్యూరేటర్, ప్లేయర్ ఏజెంట్, అంపైర్లు, ICC, NCF అధికారులు ఇలా ప్రతీ ఒక్కరూ ఫిక్సింగ్‌ నిబంధనల పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకునే అధికారం ఐసీసీకి ఉంది. ఆటగాళ్లకు ఇందులో ప్రమేయం ఉంటే జీవితకాల నిషేధం విధిస్తారు. 2011లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ , కెనడా వికెట్ కీపర్ హమ్జా తారిక్‌ను ఫిక్సర్లు సంప్రదించినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా తారిక్‌ సకాలంలో అధికారులకు ఫిర్యాదు చేశారు.