Malcolm Marshall Forgotten Iin Homeland: మాల్కం మార్షల్‌( Malcolm Marshall).. వెస్టిండీస్‌(West Indies)కు చెందిన ఫాస్ట్‌ బౌలర్‌. తన పదునైన పేస్‌ బౌలింగ్‌తో క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన పేసర్‌. విండీస్‌ స్వర్ణయుగంలో కీలక భూమిక పోషించి సీమర్‌ ఎలా ఉండాలో ప్రపంచానికి చాటిచెప్పిన ఆటగాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకరిగా మార్షల్‌ను ఇప్పటికీ కొనియాడుతుంటారు. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండే మార్షల్‌...రన్నప్‌ తీసుకుని బంతి వేయడానికి వస్తుంటేనే బ్యాటర్లు వణకిపోయేవారు. 1979, 1983 వెస్టిండీస్‌ జట్టులో కీలక ఆటగాడికి మార్షల్‌ బౌలింగ్‌లో ఎన్నో అద్భుతాలు చేశాడు. టెస్ట్‌, వన్డే క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ సీమర్‌ను ఇప్పుడు సొంత దేశమే మరిచిపోయింది. కేవలం 41 ఏళ్ల వయసులో మరణించిన మాల్కం మార్షల్‌ సమాధి ఇప్పుడు గుర్తు పట్టడానికే వీలు లేకుండా పోయింది. ఆ స్మృతి స్థలం మొత్తం ప్లాస్టిక్‌ బాటిళ్లతో నిండిపోయింది. ఇదీ ఇప్పుడు క్రికెట్‌ ప్రేమికులను విస్మయ పరుస్తోంది. ఒకప్పటి దిగ్గజ ఆటగాడికి ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ క్రికెట్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇదేనా గౌరవం

బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి  కూతవేటు దూరంలో ది గ్రేట్‌ మాల్కం మార్షల్‌ సమాధి ఉంది. 1958, ఏప్రిల్ 18న జన్మించిన మాల్కం మార్షల్  1999 నవంబర్‌ 4న కేవలం 41 ఏళ్ల వయసులోనే మరణించారు. క్యాన్సర్ కారణంగా 41 సంవత్సరాల వయస్సులో మరణించిన మార్షల్‌ను...  బార్బడోస్‌(Barbados)లోని సెయింట్ బర్తోలోమ్యూస్ చర్చి యార్డ్‌లో ఖననం చేశారు. గతంలో ఆ విమానాశ్రయంలో దిగిన తర్వాత చాలామంది క్రికెటర్లు బర్తోలోమ్యూస్‌ చర్చిలోని ఆయన సమాధి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించేవారు. కానీ కాలక్రమంలో మార్షల్‌ సమాధిని చాలామంది మర్చిపోయారు. ఇప్పుడు అక్కడ మాల్కం మార్షల్‌ ఖననం చేసిన స్థలాన్ని గుర్తు పట్టడం కూడా గగనంగా మారిపోయింది. మార్షల్ విజయాలను క్రికెట్ ప్రపంచం గుర్తించింది కానీ అతని దేశం మర్చిపోయిందంటూ క్రికెట్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. మార్షల్‌ మరణించిన 25 సంవత్సరాల తర్వాత అసలు అతని ఉనికిని కూడా మార్షల్‌ మాతృభూమి గుర్తుంచుకోలేదు.  మార్షల్ సమాధి ఉన్న ప్రదేశం ఎవరూ చూడకుండా ప్లాస్టిక్ బాటిళ్లతో నిండిపోయింది, దాని నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

ప్రేరణ ఏదీ

యువ ఆటగాళ్లకు స్ఫూర్తి నింపేందుకు...మార్షల్‌ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించేందుకు అతని ఖనన స్థలం ఉపయోగపడేది. కానీ ఆ దేశ ప్రభుత్వం అసలు దానిని పట్టించుకోవడమే మానేసింది. ఇటీవల గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  దిగిన ఒక వ్యక్తి తన మార్షల్ సమాధి ఎక్కడా అని ప్రశ్నిస్తే అధికారులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దీంతో ఈ విదార ఘటన బహిర్గతమైంది. మార్షల్ గొప్పతనం ఇక్కడి ప్రభుత్వానికి తెలియడం లేదని.. ఆధునిక క్రికెటర్లు అతనిని అంత తేలికగా మరచిపోరని స్థానికులు అంటున్నారు. మార్షల్ తన చివరి టెస్టును 1991లో 20.94 సగటుతో 376 వికెట్లతో ముగించాడు.