Pakistan survives scare beats Ireland by three wickets : టీ 20 ప్రపంచకప్‌(T20 WorldCup)ను పాకిస్థాన్‌ (Pakistan)విజయంతో ముగిసింది. ఇప్పటికే పొట్టి ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన పాక్‌ నామమాత్రమైన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించింది.  అమెరికా, భారత్‌ చేతిలో ఓటములతో టీ 20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనై నిష్క్రమించిన పాక్‌  ఐర్లాండ్‌పై మాత్రం సాధికార విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  ఐర్లాండ్‌( Ireland )ను పాక్‌ బౌలర్లు 106 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం 107పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి  విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్‌ ఏలో మూడో స్థానంలో పాక్‌ ప్రపంచకప్‌లో ప్రయాణాన్ని ముగించింది.
 

రాణించిన బౌలర్లు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇది ఎంత పెద్ద తప్పుడు నిర్ణయమో తొలి ఓవర్‌లోనే ఐర్లాండ్‌కు తెలిసివచ్చింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే పాక్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ.. ఐర్లాండ్‌ను చావు దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి ఐర్లాండ్‌ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్‌ మూడో బంతికి ఆండీ బాల్బిర్నీని బౌల్డ్‌ చేసిన షాహీన్‌ షా అఫ్రీదీ...  ఆ తర్వాత అయిదో బంతికి టక్కర్‌ను అవుట్‌ చేశాడు. దీంతో ఐర్లాండ్‌ స్కోరు బోర్డుపై రెండు పరుగులు కూడా చేరకుండానే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మహ్మద్ అమీర్‌ ఐర్లాండ్‌ను మరింత దెబ్బ తీశాడు. పాల్‌ స్టిర్లింగ్‌ను తొలి ఓవర్‌లోనే అవుట్‌ చేసిన అమీర్‌... ఐర్లాండ్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు. దీంతో ఐర్లాండ్‌ నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం షహీన్‌ షా అఫ్రిదీ ఐర్లాండ్‌ను మరో దెబ్బ కొట్టాడు. జట్టు స్కోరు పదిహేను పరుగులకు చేరిందో లేదో మరో వికెట్‌ తీసి గట్టి షాక్‌ ఇచ్చాడు. ఆరు బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయని హ్యారి టెక్టర్‌ను.. అఫ్రిదీ వికెట్ల ముందు దొరకబుచ్చుుకున్నాడు. దీంతో ఐర్లాండ్‌ 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 11 పరుగులు చేసిన జార్జ్‌ డోక్రెల్‌న అమీర్‌ అవుట్‌ చేయడంతో 28 పరుగులకే ఐర్లాండ్‌ సగం మంది బ్యాటర్లను కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన చాంఫర్‌ను హరీస్‌ రౌఫ్‌ అవుట్‌ చేయడంతో 32 పరుగులకే ఐర్లాండ్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. పాక్‌ బౌలర్ల విజృంభణ చూస్తే ఐర్లాండ్‌ అసలు 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది.  అప్పటికే ఐర్లాండ్‌ ఆరు వికెట్లు కోల్పోవడంతో ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతో సేపు పట్టదు అనిపించింది. అయితే ఎప్పటిలాగే పాక్‌ బౌలర్లు మళ్లీ గాడి తప్పారు. పాక్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసిన డెలనీ 19 బంతుల్లో ఒక ఫోర్‌, మూడు సిక్సులతో 31 పరుగులు చేయడంతో ఐర్లాండ్‌ స్కోరు 70 పరుగులు దాడింది. ఏడో వికెట్‌కు అదైర్‌- డెలనీ మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో ఐర్లాండ్‌ స్కోరు 76 పరుగులకు చేరింది. ఈ దశలో ఇమామ్‌ వసీమ్‌ ఈ ఇద్దరిని అవుట్‌ చేసి పాక్‌ను మళ్లీ పోటీలోకి తెచ్చాడు. అయితే జోష్‌ లిటిల్‌ 18 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌తో 22 పరుగులు చేయడంతో ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

 

తేలిగ్గానే

107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు శుభారంభమే దక్కింది. పాక్‌ ఓపెనర్లు  రిజ్వాన్‌, అయూబ్‌ తొలి వికెట్‌కు 23 పరుగులు జోడించారు. దీంతో పాక్ విజయం తేలికే అనిపించింది. కానీ వీరిద్దరూ 17 పరుగులు చేసి అవుటయ్యారు. అనంతరం ఫకర్ జమాన్‌ 5, ఉస్మాన్‌ ఖాన్ 2, షాదాబ్‌ ఖాన్‌ 0 పరుగులకే అవుట్‌ కావడంతో 39 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి పటిష్టంగా ఉన్న పాక్ 57 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌ ,అబ్బాస్ ఆదుకున్నారు.  వీరు ఏడో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  చివరి రెండు ఓవర్లలో షహీన్‌ అఫ్రిది  జట్టు విజయానికి 12 పరుగులు అవసరం కాగా రెండు సిక్స్‌లు కొట్టి గెలిపించేశాడు.