భారత క్రికెట్‌కు దూకుడు  నేర్పిన సారథి ఎవరు..? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బెంగాల్ టైగర్  సౌరవ్ గంగూలీ.  మిలినియల్స్ (2000 దశకంలో పుట్టినవాళ్లను ఇలా పిలుస్తారు)కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ  నైంటీస్ కిడ్స్ అని పిలుచుకునే వారికి  గంగూలీ  ఆట, ఫీల్డ్‌లో అతడి దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. సచిన్, ద్రావిడ్ వంటి  సున్నితమైన మనస్తత్వం కలిగినవారి  నాయకత్వం చూసిన భారత  జట్టుకు  దాదా   దూకుడు నేర్పాడు. అప్పట్లో క్రికెట్‌లో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన  ఆస్ట్రేలియా, ఆ జట్టు ఆటగాళ్లతో  ఢీ అంటే ఢీ అన్నాడు.  అలాంటి దాదా ముందు కుప్పిగంతులు వేస్తే చూస్తూ ఊరుకుంటాడా..?  రెండ్రోజుల క్రితం  ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని  కోహ్లీ ‘అన్‌ఫాలో’ చేయగా తాజాగా ఇప్పుడు దాదా వంతు వచ్చింది.  


రెండ్రోజులుగా  ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య నడుస్తున్న సోషల్ మీడియా వార్‌కు మరింత  మసాలా అందిస్తూ  గంగూలీ కూడా   ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీని అన్‌ఫాలో చేశాడు. పొద్దస్తమానం ఇదే పనిమీద సోషల్ మీడియాలో తిష్ట వేసుకుని ఉండే విశ్లేషకులు..  ఫోటోలు, వీడియోలతో సహా ఆధారాలను చూపెడుతున్నారు.   


 






అక్కడ మొదలైంది.. 


వాస్తవానికి  గంగూలీ - కోహ్లీల మధ్య కోల్డ్ వార్ 2021 నుంచే సాగుతున్నా  ఐపీఎల్-16లో  ఏప్రిల్  15న ఆర్సీబీ - ఢిల్లీ మధ్య జరిగిన  మ్యాచ్ తర్వాత  ఇది నానాటికీ   ఉధృతమవుతోంది.  ఆ మ్యాచ్ లో  కోహ్లీ.. గంగూలీ వైపు కోపంగా చూడటం.. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో రచ్చ మొదలైంది.  ఇదే క్రమంలో  కోహ్లీ.. దాదాను ‘అన్‌ఫాలో’ చేయడంతో  ఈ ఇద్దరి మధ్య వార్ పీక్స్‌కు చేరింది.  


 






ఇలా సాగుతోంది.. 


కోహ్లీ ఇన్‌స్టాలో చేసిన పని వైరల్ కావడంతో ఈసారి దాదా వంతు వచ్చింది. గంగూలీ కూడా  తన ఇన్‌స్టా ఖాతా నుంచి పాలో అవుతున్నవారి లిస్ట్ లో  విరాట్‌ను తీసేశాడు. ఐపీఎల్ లో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లు,  ప్రేక్షకులను చివరి బంతి వరకూ ఉన్నచోటును కదలనీయకుండా చేస్తున్న  హై స్కోరింగ్ డ్రామాల కంటే   దాదా  - కోహ్లీ  వార్ మరింత రసకందాయంగా  మారుతోంది. దీనిపై దాదా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఇప్పటికైనా  వేషాలు మానుకుంటే మంచిది.. అటిట్యూడ్‌కు అమ్మామొగుడక్కడ’ అంటూ కోహ్లీ ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు.  మరి దీనికి  ముగింపు ఎక్కడో..!


కాగా ఐపీఎల్ - 16 లో కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్‌లలో  రెండు  గెలిచి మూడింట్లో ఓడి నాలుగు పాయింట్లతో  పాయింట్ల పట్టికలో  ఏడో స్థానంలో ఉంది.   సౌరవ్ గంగూలీ మెంటార్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ ఓడి చిట్టచివరి స్థానంలో నిలిచింది.  ఢిల్లీ  ఈనెల 20న  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుండగా   ఆర్సీబీ  అదే రోజు  పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది.  ఐపీఎల్ - 16లో ఇదివరకే ఒకసారి తలపడిన  ఆర్సీబీ - ఢిల్లీలు మళ్లీ మే 6న ఢీకొననున్నాయి. మరి అప్పటి మ్యాచ్ లో అయినా కోహ్లీ, గంగూలీలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారో లేదో  చూడాలి.