Fine on Virat Kohli: టీమిండియా మాజీ సారథి,  ఆర్సీబీ  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి దూకుడెక్కువ.  ఫీల్డ్‌లో కోహ్లీ అగ్రెసివ్‌నెస్ గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన  పన్లేదు.  కోహ్లీ ఫీల్డింగ్ చేస్తుండగా ఎవరైనా బ్యాటర్  అవుట్ అయితే అతడి  సెలబ్రేషన్స్  కూడా  దూకుడుగా ఉంటుంది.  డేవిడ్ వార్నర్ డకౌట్ అయినా జోష్ హెజిల్‌వుడ్ నిష్క్రమించినా కోహ్లీ  అగ్రెసివ్‌నెస్ మారదు.  ఇది కొన్నిసార్లు అతడికి  చేటు చేసినా  అతడు మాత్రం దీనిని వీడలేదు. తాజాగా ఇదే దూకుడు వైఖరి  కారణంగా కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది.  ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు గాను అతడికి జరిమానా విధించింది. 


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తో సోమవారం రాత్రి ముగిసిన  మ్యాచ్  తర్వాత ఐపీఎల్ నిర్వాహకులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ స్టేట్‌మెంట్‌లో కోహ్లీపై  ఎందుకు జరిమానా విధించారో  ప్రత్యేకించి వివరణ ఇవ్వలేదు.  ‘ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ    ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను  అతడి మ్యాచ్ ఫీజులో   10 శాతం కోత విధిస్తున్నాం. కోహ్లీ  ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.2 ను ఉల్లంఘించినందుకు గాను లెవల్ 1 అఫెన్స్ కింద అతడికి   ఫైన్ విధించాం’అని  ప్రకటనలో పేర్కొంది. 


కారణమిదేనా..? 


అయితే ఈ నిబంధన  ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో  ఒక ఆటగాడి ప్రవర్తన శ్రుతి మించితే  వారికి జరిమానా విధిస్తారు.  సోమవారం  సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో  ఆ జట్టు బ్యాటర్  శివమ్ దూబేను వేన్ పార్నెల్  ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడబోయిన దూబే ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద సిరాజ్  అందుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ  కాస్త అతిగానే స్పందించాడు.    సిరాజ్ క్యాచ్ అందుకోగానే  కోహ్లీ.. తన చేతిని కిందకు పంచ్ ఇస్తూ  ఏదో అభ్యంతరకర వర్డ్ కూడా అన్నాడు.  అంతకుముందు  సిరాజ్.. గైక్వాడ్ ను ఔట్ చేసినప్పుడు కూడా ఇదేరీతిలో  అగ్రెసివ్ సెలబ్రేట్ చేసుకున్నాడు.  బహుశా  కోహ్లీకి ఫైన్ పడింది కూడా  దూబే అవుట్ అయినప్పుడు   అతడు చేసుకున్న సెలబ్రేషన్స్ గురించేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.  






కాగా  సోమవారం ఆర్సీబీ - సీఎస్కే మధ్య ముగిసిన  హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో  చెన్నై   8 పరుగుల తేడాతో  విజయఢంకా మోగించింది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన  చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్లు కోల్పోయి  226 పరుగులు చేసింది.   డెవాన్ కాన్వే  (83), శివమ్ దూబే (53),  అజింక్యా రహానే (37)  లు రాణించారు.  లక్ష్య ఛేదనలో బెంగళూరు కూడా ధాటిగానే ఆడింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (76), డుప్లెసిస్ (62), దినేశ్ కార్తీక్ (28)  లు పోరాడినా చివర్లో తడబటంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.  ఈ గెలుపుతో చెన్నైై ఆడిన ఐదు మ్యాచ్‌లలో  మూడో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి  దూసుకెళ్లింది. ఆర్సీబీ ఐదు మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచి  ఏడో స్థానంలో ఉంది.