Karnataka Election Results 2023: దేశమంతా ఆసక్తి రేకెత్తించిన  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. పదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత  కాంగ్రెస్ పార్టీ సొంతంగా   మ్యాజిక్ ఫిగర్ (113 సీట్లు) ను దాటి   135 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి అక్కడ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.  భారతీయ జనతా పార్టీ  66  సీట్లకే పరిమితమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. అయితే  ఈ ఫలితాలపై   టీమిండియా  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ  తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడని (?), రాహుల్ గాందీని  పొగుడుతూ  స్టోరీ షేర్ చేశాడని  ఓ  పోస్ట్ వైరల్ గా మారింది.  


రాహుల్ గాంధీని పొగుడుతూ.. 


కర్ణాటక ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే  విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా స్టోరీస్ లో  కాంగ్రెస్ అగ్రనాయకుడు  రాహుల్ గాంధీ  ఫోటోను షేర్ చేస్తూ.. ‘ది మ్యాన్, ది మిత్, ది లీడర్ @రాహుల్ గాంధీ’అని  షేర్ చేసినట్టు  ఓ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.  తర్వాత  కొద్దిసేపటికే  ఇది మాయమైనట్టు కూడా  నెటిజన్లు వాపోయారు.   


 






నిజమేనా..? 


కోహ్లీ నిజంగానే రాహుల్ గాంధీని పొగిడాడా..?  లేదు. ఇది ఫేకుడు రాయుళ్లు చేసిన పని.  కోహ్లీ ఐపీఎల్ - 16 లో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. సాధారణంగా క్రికెటర్లు (మాజీలు, ఏదైనా పార్టీలో జాయిన్ అయినవారు తప్ప) రాజకీయాలు, సున్నితమైన అంశాల జోలికి పోరు. కోహ్లీ  అందుకు భిన్నమేమీ కాదు.  ఢిల్లీలో  సుమారు 20 రోజులుగా తన తోటి క్రీడాకారులు, భారతీయ స్టార్ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తుంటేనే వారికి మద్దతుగా కోహ్లీ ఒక్క ట్వీట్ గానీ,  ఓ చిన్న కామెంట్ గానీ  చేయలేదు. అలాంటి కోహ్లీ  కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడటం, పోస్ట్ పెట్టడం అతిశయోక్తే. కోహ్లీ పోస్ట్ కూడా ఫేక్ అని  పలు వార్తా సంస్థల ‘ఫ్యాక్ట్ చెక్’ లు బల్లగుద్ది మరీ చెప్పాయి. 


 






కోహ్లీ  ఇటీవల  లక్నోతో  మ్యాచ్ లో గంభీర్,  నవీన్ ఉల్ హక్ తో వాగ్వాదం తర్వాత  గుజరాత్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా తో పాటు  తనకు కౌంటర్ ఇచ్చిన  గంభీర్, నవీన్ లకు కౌంటర్ గా  ఓ ఫోటో స్టోరీ షేర్ చేశాడు. ముంబై ఇండియన్స్  - గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో  సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేసిన తర్వాత అతడిని పొగుడుతూ ఓ  స్టోరీ  పెట్టాడు.  సూర్య పోస్ట్ తర్వాత  కోహ్లీ ఇన్‌స్టా స్టోరీస్ లో మరో   స్టోరీ రాలేదని   అతడి ప్రొఫెల్ ను నిత్యం  వాచ్ చేసే వాళ్లు చెబుతున్నారు.