Pakistan Cricket Teams Army style Training: కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మొదలైన పాక్‌ క్రికెటర్ల కష్టాలు ఇప్పుడు పతాకస్థాయికి చేరాయి. పాకిస్తాన్ జట్టు (Pakistan Cricket Team) అన్ని ఫార్మాట్లలో ఘోరంగా విఫలమవుతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. కెప్టెన్ల దగ్గరి నుంచి  కోచింగ్ సిబ్బంది వరకు అందరూ రాజీనామాలు చేసి వైదొలిగారు. పాక్‌ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కూడా మారాడు. ఇలాంటి మార్పుల మధ్య పాకిస్తాన్ క్రికెట్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెటర్ల ఫిట్‌నెస్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2024 సీజన్ ముగిసిన వెంటనే జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంతో కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. 


ఫిటెనెస్‌ కోసమే
సైన్యంలో శిక్షణతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ మెరుగుపడుతుందని భావించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు... పాక్‌ క్రికెటర్లకు సైనికుల నేతృత్వంలో కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణకు పంపింది. సైనిక శిక్షణ వల్ల పాక క్రికెటర్ల ఫిట్నెస్ మరింత మెరుగుపడుతుందని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఆటగాళ్ల సైనిక శిక్షణకు సంబంధించిన వీడియోను కూడా పాక్‌ క్రికెటర్‌ బోర్డు విడుదల చేసింది. ప్రస్తుతం వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో కసరత్తులు చేస్తున్నారు. వీరికి ఫిట్‌నెస్‌ను పెంచే వ్యాయామాలతో పాటు సైనికుల తరహాలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. బాబర్‌ అజామ్‌, రిజ్వాన్‌తో పాటు దాదాపు 30 మంది ఆటగాళ్లు దీనిలో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌ క్రికెట్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.


ఎవరెవరు ఉన్నారంటే..?
సాహిబ్‌జాదా ఫ‌ర్హ‌న్‌, హ‌సీబుల్లా, సౌద్ ష‌కీల్‌, ఉస్మాన్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ హ‌రిస్‌, స‌ల్మాన్ అలీ ఆఘా, ఆజ‌మ్ ఖాన్‌, ఇఫ్తిక‌ర్ అహ్మాద్‌, ఇర్ఫాన్ ఖాన్ నియాజి, షాదాబ్ ఖాన్‌, ఇమాద్ వాసిమ్‌, ఉసామా మీర్‌, మ‌హ‌మ్మ‌ద్ న‌వాజ్‌, మెహ్ర‌న్ ముంతాజ్‌, బ్రార్ అహ్మ‌ద్‌, ష‌హీన్ షా అఫ్రిది, న‌సీమ్ షా, మ‌హ‌మ్మ‌ద్ అబ్బాస్ అఫ్రిది, హ‌స‌న్ అలీ, మొహ‌మ్మ‌ద్ అలీ, జ‌మాన్ ఖాన్‌, మ‌హ‌మ్మ‌ద్ వ‌సీం జూనియ‌ర్, ఆమిర్ జ‌మాల్‌, హ‌రీస్ రౌఫ్‌, మ‌హ‌మ్మ‌ద్ ఆమిర్ ఉన్నారు. పాకిస్థాన్‌ క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీ20 ప్రపంచ కప్‌ సమీపిస్తున్న తరుణంలో.. షహీన్‌ అఫ్రిదిని తప్పించి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి బాబర్‌ అజామ్‌కు అప్పగించారు. ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.


ట్రోల్స్‌ మాములుగా లేవు
 పాక్‌ క్రికెటర్లకు సైనిక శిక్షణ ఇప్పిస్తుండడంపై  సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ మాములుగా ఉండడం లేదు. ఇది ఆటనుకున్నారా.. యుద్ధం అనుకున్నారా అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో ఇదంతా చూడటానికి ఫన్నీగా ఉందని పోస్ట్‌లు చేస్తున్నారు. మ్యాచ్‌ ఆడుతున్నారా.. లేక అమెరికాపై దాడి చేస్తారా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు