Jasprit Bumrah Baby Boy: టీమిండియా పేస్ గుర్రం జస్ప్రిత్ బుమ్రా కొత్త పాత్రలోకి ప్రవేశించాడు. ఇన్నాళ్లు భర్త పాత్రను నిర్వర్తిస్తున్న బుమ్రా ఇప్పుడు  తండ్రిగా  ప్రమోట్ అయ్యాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్.. సోమవారం ఉదయం ముంబైలోని ఓ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ ఇద్దరి చేతులలో బుల్లి బుమ్రా చిన్ని చేతిని ఉంచి తీసిన ఫోటోను షేర్ చేస్తూ  అతడు ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలలో వెల్లడించాడు.  ఆసియా కప్  - 2023 ఆడేందుకు శ్రీలంకకు వెళ్లి శనివారం  పాకిస్తాన్‌తో  జరిగిన మ్యాచ్ తర్వాత  ఆదివారం ఉన్నఫళంగా బుమ్రా ఉన్నఫళంగా ముంబైకి వచ్చిన విషయం తెలిసిందే.  


ఆదివారం  బుమ్రా  హఠాత్తుగా  ముంబైకి రావడంతో  అతడికి మళ్లీ ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చిందా..? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినా తన భార్య  డెలివరీ  కోసమే  ఈ స్టార్ పేసర్  భారత్‌కు తిరిగొచ్చాడని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.  తొలిసారిగా బిడ్డకు జన్మనివ్వబోతున్న  సంజనాతో ఉండాలని భావించిన బుమ్రా ముంబై వచ్చాడు. 


పేరు అంగద్ బుమ్రా.. 


బుమ్రా - సంజనాలు తమ కుమారుడికి ‘అంగద్’గా నామకరణం చేశారు.  ‘మా చిన్న కుటుంబం పెరిగింది. మా హృదయాలు ఊహించిన దానికంటే నిండుగా ఉన్నాయి. ఈ (సోమవారం) ఉదయం  మా అబ్బాయి అంగద్ జస్ప్రిత్ బుమ్రాను ప్రపంచలోకి  స్వాగతించాం.  మేము  ప్రస్తుతం అత్యంత సంతోషంగా ఉన్నాం. మా జీవితాలలో ఈ కొత్త అధ్యాయం, దానితో పాటు  వచ్చే ప్రతీదానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ  బుమ్రా ట్విటర్ వేదికగా ప్రకటించాడు. 


 






మగబిడ్డకు జన్మనిచ్చిన సంజనా గణేషన్‌ - బుమ్రా దంపతులకు ట్విటర్ వేదికగా  శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.   భార్య డెలివరీ కోసమే ముంబై వచ్చిన బుమ్రా.. నేడు భారత జట్టు నేపాల్‌తో  ఆడబోయే మ్యాచ్‌లో అందుబాటులో ఉండడు.  కానీ  సూపర్ - 4 స్టేజ్‌కు మాత్రం భారత జట్టుతో కలుస్తాడు.  ఏడాదికాలంగా  వెన్నునొప్పితో బాధపడుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో  సర్జరీ చేయించుకున్న బుమ్రా.. త్వరగానే కోలుకుని  భారత జట్టులోకి పునరాగమనం చేయడంతో పాటు తాజాగా తండ్రి కూడా కావడంతో డబుల్  హ్యాపీతో  ఉన్నాడని చెప్పడంలో సందేహమ లేదు.


 






 



































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial