India Vs Australia News: భారత్, ఆస్ట్రేలియా జట్ల ఈనెల 26 నుంచి అంటే గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొన్ని వ్యక్తిగత రికార్డులకు చేరువలో ఉన్నారు. ఈ మ్యాచ్ లోనే ఈ మైలురాళ్లను అధిగమించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా బుమ్రా మరో ఆరు వికెట్లు సాధిసతే అంతర్జాతీయ టెస్టులో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ టెస్టులో తనకు మరో ఆరు వికెట్లు అవసరం కానున్నాయి. మరోవైపు ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో 600 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని జడేజా తహతహా లాడుతున్నాడు. అతనికి ఏడు వికెట్ల అవసరం ఉంది. 


ఆసీస్ పై మంచి రికార్డు..
ఇప్పటివరకు కెరీర్లో 43 టెస్టులాడిన బుమ్రా.. కేవలం 19.52 సగటుతో 194 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 6/27 కావడం విశేషం. మొత్తానికి 12 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇక ఈ సిరీస్ లో బుమ్రా తన వాడిని చూపిస్తున్నాడు. కేవలం 10.90 సగటుతో 21 వికెట్లు తీసి, సిరీస్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. 6/76 ఈ సిరీస్ లో అతని ఉత్తమ గణంకాలు. ఇప్పటికే రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బుమ్రా.. మరోసారి నాలుగు వికెట్లను తీశాడు. ఇక ఆసీస్ పై అద్భుత రికార్డును కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు పది టెస్టులాడిన బుమ్రా, 17.15 సగటుతో 53 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేయగా, 6/33 ఉత్తమ గణాంకాలుగా నిలిచాయి. 


ఐదో బౌలర్ గా నిలిచేందుకు తహతహ..
అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లను ఇప్పటివరకు కేవలం నలుగురు బౌలర్లే తీయడం విశేషం. ఇప్పటిరవకు 349 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన జడేజా, 29.04 సగటుతో 594 వికెట్లు తీశాడు. అందులో 17 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేసుకున్నాడు. 7/42 అత్యుత్తమ గణాంకాలుగా నిలిచాయి. మరో ఆరు వికెట్లు తీస్తే 600 వికెట్ల మార్కును చేరుకున్న ఐదో భారత బౌలర్ గా నిలుస్తాడు. ఇప్పటివరకు అనిల్ కుంబ్లే (953 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 వికెట్ల క్లబ్ లో ఉన్నారు. తను కూడా ఈ క్లబ్ లో చేరాలని జడేజా తహతహలాడుతున్నాడు. మరోవైపు ఆసీస్ పై జడేజాకు కూడా మంచి రికార్డు ఉంది. 18 టెస్టులు ఆడిన జడేజా, కేవలం 20.35 సగటుతో 89 వికెట్లు తీశాడు. తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 7/42ని ఈ జట్టుపైనే నమోదు చేయడం విశేషం. మొత్తానికి ఈ జట్టుపై ఐదుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అయితే తాజా ఐదు టెస్టుల సిరీస్ లో బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టులో మాత్రమే జడేజా ఆడాడు. అందులో వికెటేమీ తీయలేదు. సో, మెల్ బోర్న్ లోనైనా సత్తా చాటి త్వరగా 600వ అంతర్జాతీయ వికెట్ తీయాలని జడేజా గట్టి పట్టుదలతో ఉన్నాడు. 


Also Read: Viral Video: భారత ప్రాక్టీస్ సెషన్లో అభిమాని అత్యుత్సాహం.. అసహనానికి లోనైన రోహిత్ శర్మ