Pawan on Hanuma Vihari: టీం ఇండియా(Team India) క్రికెటర్ హనుమ విహారి(Hanuma Vihari)కి సంఘీభావం తెలుపుతూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pavan Kalyan)ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత క్రికెటర్ కంటే వైకాపా నాయకుడే ముఖ్యమా అని ప్రశ్నించారు. గాయాలైనా సరే ఏపీ రంజీ జట్టు కోసం విహారి ఆడిన విషయాన్ని గుర్తుచేశారు. కెప్టెన్ గా ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టును ఐదు సార్లు నాకౌట్ కు అర్హత సాధించడంలో విహారి కీలకపాత్ర పోషించారని వివరించారు. ఇప్పుడు వైకాపా కార్పొరేటర్ కారణంగానే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు విహారి తన కెప్టెన్సీకి రాజీనామా సమర్పించాల్సి వచ్చిందని ఆరోపించారు.
మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటూ సీరియస్ ట్వీట్ చేస్తూ దాన్ని జై షా కు ట్యాగ్ చేసారు. ఆంధ్రా క్రికెట్ టీమ్ కెప్టెన్ ని రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానించినప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా ’లాంటి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లాభమేంటి జగన్ అని ప్రశ్నించారు. విహారికి జరిగిన అన్యాయానికి, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆయన పట్ల వివక్షత చూపిన తీరుకు చింతిస్తున్నామన్నారు. భారత జట్టుకు ఆడిన ఆటగాడు, రాష్ట్ర రంజీ ప్లేయర్ కంటే అసలు క్రీడలతో సంబంధమే లేని వైసిపి నాయకుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ఎక్కువయ్యాడు... సిగ్గుచేటు!'' అని పవన్ మండిపడ్డారు.
అలాగే విహారిని "ప్రియమైన హనుమ విహారి, మీరు రాష్ట్రానికి, దేశానికి ఛాంపియన్ ప్లేయర్. మీ విశిష్ట సేవలతో రాష్ట్రానికి చెందిన యువతకు, ఆటగాళ్లకు మీరు స్పూర్తిగా నిలుస్తున్నారు. మీరు చేసిన సేవలకు ధన్యవాదాలు. మీ పట్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహరించిన తీరు క్రికెట్ ను ప్రేమించే తెలుగు ప్రజలందరినీ ఎంతో బాధించింది. మీకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే.. ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌తో మీరు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరపున ఆడతారని నేను విశ్వసిస్తున్నాను " అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ట్వీట్ కి బిసిసిఐ, భారత క్రీడా విభాగాలతో పాటు జై షా కు ట్యాగ్ చేసారు.
అసలేం జరిగిందంటే ..
భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ జట్టు తరఫున ఆడబోనని , ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని సీనియర్ బ్యాటర్ హనుమ విహారి సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్‌తో క్వార్టర్ ఫైనల్‌లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం విహారి ఈ నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తనను కెప్టెన్ నుంచి తప్పించినా జట్టు పట్ల, ఆట పట్ల ప్రేమతో ఇన్నాళ్లు ఆటను కొనసాగించానని పేర్కొన్నారు. ఇకపై ఆంధ్ర తరఫున ఆడబోనని తేల్చిచెప్పారు. ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారడంతో ఈ విషయంపై ఇన్‌స్టాలోనే పృథ్వీ రాజ్ అనే మరో క్రికెటర్ కౌంటర్ పెట్టాడు. నువ్వు ఇంతకు మించి ఏమీ పీకలేవు మిస్టర్ సో కాల్డ్ చాంపియన్’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతే కాదు ‘ఒక వేళ నీవు కావాలనుకుంటే ఈ సింపథీ గేమ్ ఆడుకో’ అని రాశాడు. ఆ వెంటనే తననే కెప్టెన్‌గా కొనసాగించాలని జట్టులోని ఆటగాళ్లంతా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు రాసిన లేఖ బయట పెట్టాడు విహారి. ఏసీఏ తనపై చేసిన ఆరోపణలు నిజం కాదని, ఎప్పుడైతే లేఖ బయటకు వచ్చిందో వెంటనే నుంచి సపోర్ట్ స్టాఫ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని, వారందర్నీ తనకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఒత్తిడి చేస్తున్నారని, తనపై అబద్ధాలు చెప్పించే ప్రయత్నం జరుగుతుందన్నాడు.