Universe Boss Chris Gayle smashes 10 sixes in vain: యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌(Chris Gayle) విరుచుకుపడ్డాడు. ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024((VVPL 2024)) ఎడిషన్‌లో తెలంగాణ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న క్రిస్‌ గేల్‌.. భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ గేల్‌ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న గేల్‌.. 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. గేల్‌ చెలరేగిపోయినా తెలంగాణ విజయం సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 269 పరుగుల భారీ స్కోరు చేసింది. పవన్‌ నేగి 56 బంతుల్లోనే 139 పరుగులతో తెలంగాణ టైగర్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. యూపీ కెప్టెన్‌ సురేశ్‌ రైనా 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అనంతరం గేల్‌ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడినా తెలంగాణకు ఓటమి తప్పలేదు. తెలంగాణ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. గేల్‌ ఔటైన తర్వాత ఆఖర్లో శశకాంత్‌ రెడ్డి (39), కమలేశ్‌ (46 నాటౌట్‌) తెలంగాణను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నిర్ధేశించిన లక్ష్యానికి తెలంగాణ 46 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 


రాజస్థాన్‌పై గెలుపు
ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మొట్టమొదటి ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్‌ లెజెండ్స్‌పై ఒక్క పరుగు తేడాతో గెలిచింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా మ్యాచ్‌ సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తెలంగాణ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తెలంగాణ టైగర్స్‌ ఓపెనర్‌ శివ భరత్‌ కుమార్‌ సాగిరి 59 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలవడంతో తెలంగాణ భారీ స్కోర్‌ చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో పర్విందర్‌ అవానా 2, సెక్కుగే ప్రసన్న, ఇషాన్‌ మల్హోత్రా, లఖ్విందర్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్‌.. 172 పరుగులే చేయగలిగింది. తంగిరాల పవన్‌ కుమార్‌, తిలక్‌, ఖాద్రి తలో 2 వికెట్లు, సందీప్‌ త్యాగి ఓ వికెట్‌ పడగొట్టారు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఏంజెలో పెరీరా (32), ఇషాన్‌ మల్హోత్రా (36), రాజేశ్‌ బిష్ణోయ్‌ (44) పరుగుల చేశారు.


కెప్టెన్‌గా గేల్‌
తెలంగాణ టైగర్స్ జట్టులో క్రిస్ గేల్‌తో పాటు వెస్టిండీస్ మాజీ బ్యాటర్ రికార్డో పావెల్‌ భాగం అయ్యాడు. భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగి, మన్‌ప్రీత్ గోని కూడా టైగర్స్ జట్టులో సభ్యులు. ఐవీపీఎల్ టోర్నీలో వీరేందర్ సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేష్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసుఫ్ పఠాన్, హెర్షెల్ గిబ్స్ లాంటి ఎందరో మాజీలు ఆడనున్నారు. వీవీఐపీ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, తెలంగాణ టైగర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఐవీపీఎల్లో ఆడనున్నాయి.