Delhi Capitals seal 9 wicket victory: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2024)లో యూపీ వారియర్స్‌(UP Warriorz)పై ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) ఘన విజయం సాధించింది. తొలుత బంతితో ఆ తర్వాత బ్యాటుతో ఢిల్లీ చెలరేగిపోయింది. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ 120పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి సునాయసంగా చేధించింది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (64*), మెగ్‌ లానింగ్‌ (51) అర్ధశతకాలతో మెరిశారు. 


యూపీ కట్టడి
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు యూపీ బ్యాటర్లు చేతులెత్తేశారు. శ్వేతా షెహ్రవాత్‌ (45), గ్రేస్‌ హారిస్‌ (17), ఎలీసా హీలే (13) మినహా ఎవరూ 10 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. రాధా యాదవ్ 4, మారిజాన్ కాప్ 3 అరుంధతి రెడ్డి, అనాబెల్ సదర్లాండ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి షఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. భారీ షాట్లతో విరుచుకుపడి ఢిల్లీకి సునాయస విజయాన్ని అందించింది. 


ముంబైకి మరో విజయం
 మహిళల ఐపీఎల్‌ (WPL) 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గుజరాత్‌ జెయింట్స్‌(Gujarat Giants )తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ కేవలం 126 పరుగులే చేయగా.. 127 పరుగుల లక్ష్యాన్ని ముంబై సునాయసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో కేథరీన్‌ బ్రైస్‌ (25 నాటౌట్‌), కెప్టెన్‌ బెత్‌ మూనీ ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. వేద కృష్ణమూర్తి (0), హర్లీన్‌ డియోల్‌ (8), లిచ్‌ఫీల్డ్‌ (7), దయాలన్‌ హేమలత (3), ఆష్లే గార్డ్‌నర్‌ (15), స్నేహ్‌ రాణా (0), లియా తహుహు (0) విఫలమయ్యారు. ముంబై బౌలర్లు అమేలియా కెర్‌ 4, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ 3 వికెట్లు తీసి గుజరాత్‌ పతనాన్ని శాశించారు. నాట్‌ సీవర్‌ బ్రంట్‌, హేలీ మాథ్యూస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అమేలియా కెర్‌ ఆఖర్‌ ఓవర్‌లో 2 వికెట్లు తీసి గుజరాత్‌ను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేసింది.


తేలిగ్గా ఛేదించిన ముంబై 
గుజరాత్ విధించిన 127 పరుగుల లక్ష్యాన్ని ముంబై సునాయసంగా ఛేదించింది. అయిదు వికెట్లను నష్టపోయి 18 ఓవర్లలో 129 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 46 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. అమెలియా కెర్ (31), నాటస్కివెర్ బ్రంట్ (22) రాణించారు. గుజరాత్‌ బౌలర్లు తనుజా కాన్వార్ 2.. లీ తహుహు, కాథరిన్‌ బ్రైస్ చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ముంబయి (4) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ప్రస్తుత ఎడిషన్‌లో గుజరాత్‌కు ఇది తొలి మ్యాచ్‌ కాగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధించి, ఖాతా తెరిచింది.