CSK Captain: ఐపీఎల్‌లో  అత్యంత విజయవంతమైన  జట్లలో ఒకటిగా నిలిచిన  చెన్నై సూపర్ కింగ్స్ గతేడాది  నాయకత్వ మార్పు  చేపట్టిన విషయం తెలిసిందే. ధోనికి అదే చివరి సీజన్ (?) గా భావించి  సరిగ్గా   2022వ సీజన్  ప్రారంభమవడానికి మూడు రోజుల ముందు  ధోని  వారసుడిగా రవీంద్ర  జడేజాను  ప్రకటించింది.   అయితే  జడేజా కంటే   సీఎస్కే..  టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేకు సారథ్య పగ్గాలు అప్పజెప్పడం మంచిదని, ధోని వారసుడిగా అతడు సక్సెస్ అవుతాడని  పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్  అంటున్నాడు. 


రహానేనే కరెక్ట్ ఆప్షన్..


స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ‘సీఎస్కే 2022లో  రవీంద్ర జడేజాను  ధోని వారసుడిగా నియమించింది. కానీ  ఇది  జడ్డూ సొంత ప్రదర్శనలపై కూడా దారుణంగా ప్రభావం చూపింది.  చివరికి కెప్టెన్ ను మళ్లీ మార్చాల్సి వచ్చింది. నా అభిప్రాయం ప్రకారం ధోని వారసుడిగా రహానే కరెక్ట్.  అతడు లోకల్ ప్లేయర్. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఫారెన్ క్రికెటర్లకంటే లోకల్ ప్లేయర్లే ఎక్కువ సక్సెస్ అవుతారు..’ అని చెప్పాడు. 


2022 సీజన్ కు ముందు చెన్నై  రవీంద్ర జడేజాకు నాయకత్వ పగ్గాలు ఇచ్చినా యుద్ధరంగం (ఫీల్డ్) లో ఈ పాచిక పారలేదు.  పారకపోగా అట్టర్ ఫ్లాప్ అయింది. జడేజా  8 మ్యాచ్‌లకు సారథిగా ఉండి  రెండింట్లో మాత్రమే జట్టును గెలిపించి  ‘ఇక నా వల్ల కాదు బాబోయ్’అని తప్పుకున్నాడు. టీమ్ మేనేజ్మెంట్ తో గొడవ పడి సీజన్ నుంచి  గాయం పేరు చెప్పి అర్థాంతరంగా తప్పుకున్నాడు. దీంతో సారథ్య పగ్గాలు మళ్లీ  ధోనినే చేపట్టాడు. 


 






ఇక రహానే విషయానికొస్తే గత సీజన్ లో  కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఆడిన  ఈ ముంబై బ్యాటర్..  2023 ఐపీఎల్ కు ముందు జరిగిన వేలంలో సీఎస్కేకు మళ్లాడు.  వేలంలో రహానేను సీఎస్కే రూ. 50 లక్షల  నామమాత్రపు ఖర్చుకు కొనుగోలు చేసింది. కానీ రహానే  చెన్నైకి సర్‌ప్రైజ్ ప్యాకేజ్ అయ్యాడు.  రూ. 16 కోట్లు వెచ్చించి తీసుకున్న బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)   రెండు మ్యాచ్ లే ఆడి విఫలమై గాయంతో బెంచ్ లో కూర్చుంటే రూ. 50 లక్షల రహానే మాత్రం పైసా వసూల్  ప్రదర్శనలతో  తనలోని మరో కోణాన్ని చూపెడుతున్నాడు.  ఈ సీజన్ లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి ఆరు ఇన్నింగ్స్ లలో 224 పరుగులు  సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.  స్ట్రైక్ రైట్ అయతే  189.83గా నమోదవుతున్నది.   


లోకల్ ప్లేయర్లే బెస్ట్.. 


ధోని వారసుడిగా రహానే ఉండాలన్న అక్రమ్..  లోకల్ ప్లేయర్లు అయితేనే  ఇక్కడ సక్సెస్ అవుతారని స్పష్టం చేశాడు. ‘ఫారెన్ ప్లేయర్లకు  టీమ్ లోని ఆటగాళ్ల పేర్లే సరిగా తెలియవు.  వాళ్లు జట్టును ఎలా నడిపిస్తారు..?  నన్నడిగితే మాత్రం  చెన్నైకి ధోని వారసుడిగా  రహానే బెస్ట్ ఆప్షన్. వాళ్లకు వారి స్వంత ప్రణాళికలు  వారికుంటాయి. దాని ప్రకారమే వాళ్లు నిర్ణయాలు తీసుకుంటారు..’అంటూ ముగించాడు.