IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏకంగా ఐదు సార్లు టైటిల్స్ గెలిచి అత్యంత విజయవంతమైన  టీమ్ గా  ఉన్న  ముంబై ఇండియన్స్‌కు ఆ జట్టు సారథి రోహిత్ శర్మ ఈసారి మాత్రం  ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.  పదేండ్లుగా ఐసీసీ  ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న భారత అభిమానుల  కల నెరవేర్చే క్రమంలో   రోహిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఈ సీజన్ లో రోహిత్..  కెప్టెన్ గా  దూరంగా ఉండనున్నాడని,  భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ముంబైని నడిపించనున్నాడని సమాచారం. 


కొన్ని మ్యాచ్‌లకే.. 


ఐపీఎల్-16 సీజన్ లో  రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్ లకే అందుబాటులో ఉంటాడట. హిట్‌మ్యాన్ గైర్హాజరీలో    నయా మిస్టర్ 360  సూర్యకుమార్ యాదవ్ ముంబైని నడిపించనున్నట్టు ఆ జట్టు వర్గాలు చెబుతున్నాయి.  మూడేండ్ల తర్వాత  ఐపీఎల్ లో అందుబాటులోకి వస్తున్న ‘హోం అండ్ అవే’  ప్రకారం ఫ్రాంచైజీలు.. తమ హోమ్ గ్రౌండ్ తో  పాటు  ప్రత్యర్థి  స్వంత వేదికలపైనా ఆడాల్సి ఉంటుంది. అయితే టీమ్ తో పాటు  ప్రయాణించే రోహిత్..   మ్యాచ్ లకు మాత్రం డుమ్మా కొడతాడని  సమాచారం.  


కారణం అదే..  


ఈసారి  రోహిత్ కొన్ని మ్యాచ్ లు డుమ్మా కొట్టేందుకు   పలు బలమైన కారణాలున్నాయి. ఈ ఏడాది  జూన్ లో  ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్  (డబ్ల్యూటీసీ) ఫైనల్ లో భారత్ ఆడాల్సి ఉంది. జూన్ 7 నుంచి ఓవల్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ లో భారత్.. ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.  2013 తర్వాత   ఐసీసీ ట్రోఫీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న భారత  జట్టు ఈసారి మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్ ను వదలకూడదనే భావనలో ఉంది. 2021లో  కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరిన భారత జట్టు  కివీస్ చేతిలో ఓడింది. కానీ ఈసారి మాత్రం   బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో మాదిరిగానే  కంగారూలను  ఓడించి విశ్వవిజేతగా నిలిచేందుకు  ప్రణాళికలు రచిస్తున్నది.   ఇందులో భాగంగానే రోహిత్..  కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు. దీనితో పాటు ఈ ఏడాది అక్టోబర్ లో భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కూడా  రోహిత్ కు చాలా కీలకం. 


తనే ఆచరిస్తూ.. 


ఇటీవల చెన్నైలో ఆసీస్ తో ముగిసిన మూడో వన్డే అనంతరం  ఆటగాళ్ల వర్క్ లోడ్ గురించి రోహిత్ మాట్లాడుతూ.. ‘ఇక మా చేతుల్లో ఏమీలేదు.  ఆటగాళ్లు ఇప్పుడు ఫ్రాంచైజీల సొంతం. వాళ్ల ఇష్టం.  కానీ ఇదివరకే మేం  క్రికెటర్లలతో పాటు  ఫ్రాంచైజీలకూ  కీలక సూచనలు చేశాం.   టీమిండియాకు రెగ్యులర్ గా ఆడే క్రికెటర్ల వర్క్ లోడ్ విషయంలో పలు జాగ్రత్తలు సూచించాం.  క్రికెటర్లు కూడా  చిన్నోళ్లేమీ కాదు. వాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాలి...’అని చెప్పిన విషయం తెలిసిందే.   మాటలు చెప్పడమే కాదు ఆచరించినవాడే అసలైన నాయకుడు అన్న సూత్రాన్ని  రోహిత్ పాటిస్తున్నాడు.  వర్క్ లోడ్ మేనేజ్మెంట్  లో భాగంగా తానే  మ్యాచ్ లను కుదించుకుని ఇతర క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి  ఈ విషయంలో  కోహ్లీ, కెఎల్ రాహుల్,  అశ్విన్, షమీ,  రవీంద్ర జడేజా, సిరాజ్, శ్రేయాస్  అయ్యర్, శుభ్‌మన్ గిల్  (వీళ్లంతా టెస్టు జట్టులో సభ్యులే)  లు సారథి అడుగుల్లో నడుస్తారా..? లేక సీజన్ మొత్తం కొనసాగుతారో చూడాలి.