RCB Fan Viral: ఐపీఎల్‌లో  ప్రతి ఏడాదీ ‘ఈసాలా కప్ నమ్దే’ అంటూ  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)  అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు.  ఇంతవరకూ ఐపీఎల్ లో కప్ కొట్టకున్నా ఆ జట్టుకు మాత్రం లోయల్ ఫ్యాన్స్ ఉన్నారు.  ట్రోఫీ గెలిచినా గెలవకున్నా  ఆ జట్టుకు సపోర్ట్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. దీనికి తాజాగా  ఐపీఎల్-16లో   చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)తో  పాటు ఆ జట్టు ఆడే ఇతర వేదికల్లో ఫ్యాన్స్ వెల్లువలా తరలివస్తున్నారు.  తాజాగా ఓ అభిమాని కూడా  ఆర్సీబీపై తన అభిమానాన్ని  చాటుకున్నాడు. 


ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి..స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు . తన బైక్‌కు  మొత్తం ఆర్సీబీ ఆటగాళ్ల స్టిక్కర్స్, ‘ఈసాలా కప్ నమ్దే’ స్లోగన్,   ఆర్సీబీ  స్లోగన్ ప్లే బోల్డ్  తో నింపేశాడు. తన బైక్ కు కూడా బెంగళూరు జెర్సీ కలరే వేయించాడు. ఇతడిని చూసిన ఓ  నెటిజన్ ఆసక్తిగా బైక్ మొత్తం చూపిస్తూ  వీడియోను  ట్విటర్ లో పోస్ట్ చేశాడు. 


 






వీడియోలో సదరు ఆర్సీబీ అభిమాని మాట్లాడుతూ.. తనకు  బెంగళూరు టీమ్ అంటే చాలా అభిమానమనీ,  కోహ్లీ - డివిలియర్స్ ల ఆటను  ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. ‘నేను ఆర్సీబీ, విరాట్ సార్ లకు అభిమానిని.  కోహ్లీ కవర్ డ్రైవ్ అంటే నాకు చాలా ఇష్టం..’ అని  తెలిపాడు.   2008 నుంచి తాను ఆర్సీబీ అభిమానినని, కప్ గెలవకున్నా బెంగళూరుకే సపోర్ట్ చేస్తానని తన బైక్ డోమ్‌కు రాసుకున్నాడు. 


ఈ వీడియో  నెట్టింట వైరల్ అవుతున్నది.   బైక్ ను మొత్తం ఆర్సీబీ జెర్సీతో నింపేసిన  ఆ వ్యక్తి ఢిల్లీకి చెందినవాడు అయినా  ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కాకుండా ఆర్సీబీకి  సపోర్ట్ చేస్తుండటం గమనార్హం.   ఇక ఈ వీడియో కింద పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘నువ్వు  నిజమైన ఆర్సీబీ అభిమానివి.. ఇన్నేండ్లలో విరాట్ కోహ్లీ  ఏం సాధించాడని  అడిగితే నిన్ను చూపిస్తాం..’ అని బెంగళూరు అభిమానులు  కామెంట్స్ చేస్తున్నారు.  


 






కాగా  ఐపీఎల్-16లో భాగంగా  ఇప్పటివరకు  9 మ్యాచ్ లు ఆడిన  ఆర్సీబీ  ఐదింటిలో గెలిచి  పది పాయింట్లతో  పాయింట్లపట్టికలో  ఐదో స్థానంలో ఉంది.   ప్లేఆఫ్స్ రేసులో   సీఎస్కే, పంజాబ్ కింగ్స్, లక్నోలతో  తీవ్ర పోటీని ఎదుర్కుంటున్నది.  రెండ్రోజుల క్రితమే లక్నోను ఓడించిన  డుప్లెసిస్ సేన శనివారం ఢిల్లీ క్యాపిటల్స్  తో ఢీకొననుంది.  ఆర్సీబీతో పాటు పంజాబ్ కూడా  దూసుకొస్తుండటంతో  ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది.