GT vs DC: ఐపీఎల్-16లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న గుజరాత్ టైటాన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో పలువురు ఆటగాళ్లు తమ పేరిట అరుదైన రికార్డులు నమోదు చేసుకున్నారు. వెటరన్ పేసర్ మోహిత్ శర్మ వంద వికెట్ల క్లబ్ లో చేరగా, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా వంద క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇటువంటి రికార్డులే మరికొన్ని..
ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ నాలుగు ఓవర్లు వేసి 11 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. తద్వారా గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో బెస్ట్ ఫిగర్స్ (4-11) నమోదుచేశాడు. గతంలో ఈ రికార్డు రషీద్ ఖాన్ (4-24) పేరిట ఉండేది. అంతేగాక ఈ సీజన్ లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌల్లలో సిరాజ్ (8) ను దాటి 12 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ లో పవర్ ప్లే లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ లో కూడా షమీ రెండో స్థానంలో నిలిచాడు. పవర్ ప్లే లో ఇషాంత్ శర్మ కొచ్చి టస్కర్స్ పై 2012లో 5-12 గణాంకాలు నమోదు చేయగా తాజాగా షమీ 4-7 రెండో స్థానంలో నిలిచాడు. ధవల్ కులకర్ణి (4-8) మూడో స్థానంలో ఉన్నాడు.
షమీ బౌలింగ్ లో రిలీ రూసో క్యాచ్ పట్టడం ద్వారా వృద్ధిమాన్ సాహా ఐపీఎల్ లో వంద క్యాచ్ లు పట్టిన మూడో వికెట్ కీపర్ గా నిలిచాడు. ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోని (178), దినేశ్ కార్తీక్ (169) లు సాహా కంటే ముందున్నారు.
ఢిల్లీ బ్యాటర్ రిపల్ పటేల్ వికెట్ తీయడం ద్వారా ఐపీఎల్ లో మోహిత్ శర్మ వందో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2013 నుంచి ఐపీఎల్ ఆడుతున్న మోహిత్.. 2014 సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు. కానీ 2018 తర్వాత పేలవ ఫామ్ తో బౌలింగ్ లో పస కోల్పోయాడు. గత సీజన్ లో గుజరాత్ క్యాంప్ లో చేరి ఈ ఏడాది సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు.
ఈ మ్యాచ్ లో ఏడో స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు ఢిల్లీ బ్యాటర్ అమన్ ఖాన్. అలా ఏడో స్థానంలో వచ్చి అర్థ సెంచరీ చేసిన వారిలో అతడు మూడో వాడు. అమన్ ఖాన్ కంటే ముందు అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్ లు ఉన్నారు. అమన్ ఖాన్ కు ఐపీఎల్ లో ఇదే ఫస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
కాగా గుజరాత్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ తడబడింది. 32కే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 125 పరుగులే చేసి ఐదు పరుగులతేడాతో ఓడింది.