GT vs DC, 1 Innings Highlights: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్‌లో ఏదీ కలిసిరావడం లేదు. అసలే ఆడిన 8 మ్యాచ్ లలో ఆరింట్లో ఓడి టోర్నీ నుంచి ‘ఎలిమినేషన్ కత్తి’ వేలాడుతున్నా ఆ జట్టు ఆటతీరు ఏమాత్రం మారలేదు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న 44వ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ ధాటికి విలవిల్లాడింది. షమీ ఏకధాటిగా 4 ఓవర్లు వేసి 11 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ జట్టులో అమన్ హకీమ్ ఖాన్ (44 బంతుల్లో 51 : 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్.
బాల్‌ను ముట్టుకోవడమే పాపం..
ఈ మ్యాచ్‌లో షమీ పవర్ ప్లే లో తన పవర్ చూపించాడు. తన బంతులను ముట్టుకుంటే ఔట్ అన్నంతగా చెలరేగాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ను డకౌట్ చేశాడు. షమీ వేసిన ఔట్ స్వింగర్‌ను కవర్స్ దిశగా ఆడిన సాల్ట్.. డేవిడ్ మిల్లర్‌కు చిక్కాడు. హార్ధిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్లో రెండో బంతికి డేవిడ్ వార్నర్ (2) రనౌట్ అయ్యాడు. ప్రియమ్ గార్గ్ - వార్నర్ మధ్య సమన్వయలోపంతో ఢిల్లీ సారథి వెనుదిరగాల్సి వచ్చింది.
హార్ధిక్ ఓవర్‌లోనే రెండు బౌండరీలు బాదిన రిలీ రూసో (8) షమీ వేసిన మూడో ఓవర్లో వికెట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చాడు. ఐపీఎల్‌లో సాహాకు ఇది వికెట్ కీపర్‌గా వందో క్యాచ్. షమీ తన తర్వాతి ఓవర్లో ఫస్ట్ బాల్‌కే మనీష్ పాండే (1) ను చివరి బంతికి ప్రియమ్ గార్గ్ (10) ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఢిల్లీ 5 ఓవర్లలో 23 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. గుజరాత్ బౌలర్ల జోరు చూస్తే ఢిల్లీ ఆర్సీబీ అత్యల్ప స్కోరు (49) రికార్డును బ్రేక్ చేస్తుందేమో అనిపించింది.
ఆదుకున్న అక్షర్ - అమన్
23 కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఢిల్లీని అక్షర్ పటేల్ (30 బంతుల్లో 27 : 2 ఫోర్లు, 1 సిక్స్), అమన్ హకీమ్ ఖాన్ లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 54 బంతులలో 54 పరుగులు జోడించారు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని మోహిత్ శర్మ విడదీశాడు. అతడు వేసిన 14వ ఓవర్లో అక్షర్ భారీ షాట్ ఆడి రషీధ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అక్షర్ నిష్క్రమించిన తర్వాత వచ్చిన రిపల్ పటేల్ (13 బంతుల్లో 23 : 2 ఫోర్లు, 1 సిక్స్) తో కూడా అమన్ కీలక భాగస్వామ్యం జోడించాడు. 27 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ ఢిల్లీ స్కోరును వంద పరుగులు దాటించారు. మోహిత్ వేసిన 18వ ఓవర్లో రెండో బాల్‌కు సిక్సర్ బాదిన అమన్.. ఆ మరుసటి బాల్‌కే డబుల్ తీసి ఐపీఎల్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. 23-5 గా ఉన్న ఢిల్లీ పుంజుకుని 130 పరుగులు చేయడం నిజంగా అద్భుతమే..