Faf du Plessis Injury: ఐపీఎల్-16లో  సోమవారం  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య   ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌ను ధోని సారథ్యంలోని  సీఎస్కే నెగ్గింది.  227 పరుగుల లక్ష్య ఛేదనలో  ఆర్సీబీ  ఆరంభం పేలవంగా ఉన్నా ఆ జట్టు సారథి  ఫాఫ్ డుప్లెసిస్  - గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ల పోరాటంతో   మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఒకదశలో  ఈ ఇద్దరి జోరు చూస్తే మ్యాచ్‌ను ఆర్సీబీ మరో రెండు ఓవర్లు మిగిలుండగానే గెలుచుకుంటుందని అనిపించింది. కానీ చివర్లో   తడబడి ఓటమి కొనితెచ్చుకుంది.  ఆర్సీబీ ఓడినా ఆ జట్టు పోరాటం అభిమానులను ఆకట్టుకుంది.  అయితే ఈ మ్యాచ్ లో గాయమైనా బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్  కడుపునకు కట్టు కట్టుకుని మరీ  ఆడాడు.  


ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో  13వ  ఓవర్లో  అతడు 56 పరుగుల వద్ద ఉండగా  కడుపు నొప్పి వేధించడంతో   ఆ జట్టు ఫిజియో వచ్చి  డుప్లెసిస్  కడుపునకు  కట్టు  (బ్యాండేజీ) కట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటో  ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  ఈ మ్యాచ్‌ లోనే సీఎస్కే బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో  డుప్లెసిస్‌ గాయపడ్డాడు.  


 






డైవ్ చేయబోయి.. 


ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం  స్వయంగా డుప్లెసిసే వెల్లడించాడు. తన పక్కటెముకకు గాయమైందని, అందుకే కట్టు కట్టారని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ‘నేను ఫీల్డింగ్ చేస్తున్న సయమంలో  ముందుకు డైవ్ చేయబోయే క్రమంలో  నా పక్కటెముకకు గాయమైంది.  ఆ నొప్పి  బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వేధించింది. అందుకే కట్టు కట్టారు.  ఇప్పుడు నేను  బానే ఉన్నా..’అని చెప్పాడు.  


కాగా గాయం వేధిస్తున్నా  డుప్లెసిస్ ఈ మ్యాచ్ లో  ఆర్సీబీ విజయానికి పోరాడిన తీరు ఆకట్టుకుంది.  ఛేదనలో 15 పరుగులకే రెండు  వికెట్లు కోల్పోయిన క్రమంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ తో కలిసి   డుప్లెసిస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  ఈ ఇద్దరూ   61 బంతుల్లోనే  126 పరుగులు జోడించి చెన్నైని భయపెట్టారు.  డుప్లెసిస్.. 33 బంతులాడి  5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో   62 పరుగులు చేశాడు. మరోవైపు మ్యాక్స్‌వెల్.. 36 బంతుల్లోనే 3 బౌండరీలు,  8 భారీ సిక్సర్ల సాయంతో   76 పరుగులు చేశాడు.  


ఫాఫ్‌పై  ప్రశంసలు.. 


ఒకపక్క నొప్పి వేధిస్తున్నా టీమ్ కోసం సైనికుడిలా పోరాడిన  డుప్లెసిస్‌పై  సోషల్ మీడియాలో  ప్రశంసలు కురుస్తున్నాయి. ఇది అతడి అంకితభావానికి నిదర్శనమని  నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  డుప్లెసిస్ - మ్యాక్స్‌వెల్ గనక మరో రెండు ఓవర్లు క్రీజులో ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని, ఓడినప్పటికీ అద్భుత పోరాటం చేశారని కొనియాడుతున్నారు.  డుప్లెసిస్‌కు ఆటపై ఉన్న అంకితభావం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదని, గతంలో చెన్నై తరఫున ఆడిన అతడు మోకాలి గాయంతో రక్తం కారుతున్నా ఫీల్డింగ్ చేసినప్పటి దృశ్యాలను ఉదహరిస్తూ  అతడిని ప్రశంసిస్తున్నారు.