Jos Buttler Unwanted Record: మెరుగైన ప్రదర్శన చేస్తే ఐపీఎల్ ఒక  నార్మల్ ఆటగాడిని స్టార్ క్రికెటర్‌గా మార్చుతుంది. అదే ఐపీఎల్.. సరిగ్గా ఆడకుంటే ఎంతటి స్టార్ క్రికెటర్‌ను అయినా డమ్మీ చేస్తుంది.   ప్రస్తుతం  ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సారథి,  రాజస్తాన్ రాయల్స్  ఓపెనర్ జోస్ బట్లర్ కూడా గత సీజన్ లో హీరో అయి ఇప్పుడు జీరో అయ్యాడు. ఈ ఏడాది బట్లర్  సున్నాలు చుట్టడంలో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. 


ఐపీఎల్-16 లో 14 మ్యాచ్ లు ఆడిన  జోస్ బట్లర్ ఏకంగా ఐదు సార్లు  డకౌట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాల వేదికగా   శుక్రవారం రాత్రి ముగిసిన  కీలక పోరులో  బట్లర్.. రబాడా వేసిన రెండో ఓవర్లోనే ఎల్బీగా వెనుదిరిగాడు.  బట్లర్‌కు  ఇది హ్యాట్రిక్ డకౌట్. 


పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ లో డకౌట్ కావడంతో  బట్లర్ ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.  ఒక ఐపీఎల్ సీజన్‌లో  అత్యధిక డకౌట్లు అయిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్.. గిబ్స్   మన్హస్, మనీష్ పాండేల రికార్డును బ్రేక్ చేశాడు.  


ఒక సీజన్‌లో మోస్ట్ డకౌట్స్ :


1. జోస్ బట్లర్ - 5
2. హెర్షల్ గిబ్స్ (డెక్కన్ ఛార్జర్స్) -  4 (2009) 
3. మిథున్ మన్హస్ (పూణె వారియర్స్) - 4 (2011) 
4. మనీష్ పాండే (పూణె వారియర్స్)  - 4  (2012)
5. శిఖర్ ధావన్ (ఢిల్లీ క్యాపిటల్స్) - 4 (2020)
6. ఇయాన్ మోర్గాన్ (కోల్‌కతా నైట్ రైడర్స్) - 4 (2021) 


గత సీజన్‌లో బట్లర్.. 


2016 నుంచి ఐపీఎల్ ఆడుతున్న బట్లర్.. ఇప్పటివరకూ 95  మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో అతడు  ఐపీఎల్-15 లో పీక్స్  చూశాడు. ఈ సీజన్ లో బట్లర్ 17 మ్యాచ్ లలో  17 ఇన్నింగ్స్ ఆడి 863 పరుగులు చేశాడు.  ఈ  సీజన్ లో  కోహ్లీ  రికార్డు (ఒక సీజన్ లో 900 ప్లస్ రన్స్)  కూడా బ్రేక్ చేస్తాడేమో అని అంతా భావించారు. ఇదే సీజన్ లో బట్లర్ నాలుగు సెంచరీలు కూడా చేశాడు.


 






డామిట్.. కథ అడ్డం తిరిగింది..!


లాస్ట్ సీజన్ లో  సూపర్ ఫామ్‌లో ఉన్న  బట్లర్.. ఈ సీజన్‌లో  మాత్రం ఐదుసార్లు డకౌట్ అయ్యాడు. గత 85 ఇన్నింగ్స్‌లో  ఒక్కసారి మాత్రమే డకౌట్ అయిన బట్లర్.. ఈ సీజన్ లో ఆడిన గత 10 ఇన్నింగ్స్ లలో ఏకంగా ఐదు సార్లు  సున్నాలకే నిష్క్రమించాడు. ఐపీఎల్ -15 లో  బట్లర్ వీరవిహారంతో  రాజస్తాన్ రాయల్స్ ఫైనల్స్‌కు చేరగా ఈ ఏడాది  అదే బట్లర్ వైఫల్యంతో  రాజస్తాన్  ప్లేఆఫ్స్‌కు కూడా చేరేది అనుమానంగానే ఉంది.


ఈ సీజన్‌లో బట్లర్.. 


గత పది ఇన్నింగ్స్‌లలో  బట్లర్ స్కోర్లు చూస్తే అతడి వైఫల్యం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  పది ఇన్నింగ్స్‌లలో బట్లర్ స్కోర్లు ఇవి : 0, 0, 0, 95, 8, 18, 27, 0, 40, 0.  గుజరాత్, పంజాబ్, కోల్‌కతాలపై ఒకసారి డకౌట్ అయిన బట్లర్..  బెంగళూరుపై  ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ డకౌట్ అయి తీవ్ర నిరాశపరిచాడు.