Jaiswal IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున  ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న యువ సంచలనం  యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులోనే  ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఘనత సాధించిన  జైస్వాల్..  తాజాగా ఒక సీజన్ లో 600, అంతకుమించి పరుగులు చేసిన  అన్‌క్యాప్డ్  ప్లేయర్ల జాబితాలో 15 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశాడు. 


ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో షాన్ మార్ష్ (పంజాబ్ కింగ్స్ తరఫున) 616  పరుగులు చేశాడు. అప్పటికీ అతడింకా ఆస్ట్రేలియా జాతీయ  జట్టుకు ఎంపిక కాలేదు. తాజాగా ఐపీఎల్-16 లో జైస్వాల్.. 2023 సీజన్‌లో   14 మ్యాచ్‌లలో   48.08 సగటుతో  625 పరుగులు సాధించాడు.  ఈ క్రమంలో అతడు ఓ సెంచరీ, ఐదు అర్థ సెంచరీలు చేయడం విశేషం. 


అతి పిన్న వయస్కుల జాబితాలో.. 


ఒక సీజన్‌లో 600+ స్కోరు చేసిన ఆటగాళ్ల (అతి పిన్న వయస్కుల)  జాబితాలో జైస్వాల్ తాజాగా  ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషభ్ పంత్ సరసన చేరాడు. 25 ఏండ్ల లోపు ఉన్న ఆటగాళ్లలో షాన్ మార్ష్,  రుతురాజ్ గైక్వాడ్ (635 - 2021లో), రిషభ్ పంత్ (684 - 2018లో) లు ఉండగా తాజాగా  జైస్వాల్  ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. పంత్  (20 ఏండ్ల  226 రోజులు),  జైస్వాల్  (21 సంవత్సరాల 142 రోజులు) లు  22 ఏండ్ల లోపే ఈ ఘనత అందుకోవడం గమనార్హం.  


 






రిషభ్ పంత్ ఈ ఘనత అందుకునే నాటికే అతడు భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఒక ఐపీఎల్ సీజన్ లో  ఆరు వందల పరుగులు చేసిన ఫస్ట్ అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్  జైస్వాల్ మాత్రమే.


రాజస్తాన్‌కు విజయం.. కానీ..!


శుక్రవారం  ధర్మశాల వేదికగా పంజాబ్ - రాజస్తాన్ ల మధ్య జరిగిన 66 వ లీగ్ మ్యాచ్ లో  రాజస్తాన్ రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.  పంజాబ్ నిర్దేశించిన  188 పరుగుల లక్ష్యాన్ని  19.4 ఓవర్లలో ఛేదించింది.  ఈ క్రమంలో రాజస్తాన్..  పాయింట్ల పట్టికలో ముంబైని వెనక్కినెట్టి  ఐదో స్థానానికి దూసుకెళ్లింది. కానీ రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఆర్సీబీ, ముంబైలు తమ చివరి లీగ్ మ్యాచ్ లలో ఓడిపోవాలి. అలా అయితేనే రాజస్తాన్‌కు ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ పంజాబ్ తో మ్యాచ్ లో లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే ఛేదించి ఉంటే రాజస్తాన్ నెట్ రన్ రేట్ కూడా ఆర్సీబీ కంటే మెరుగయ్యేది. అప్పుడు ఆ జట్టుకు ప్లేఆఫ్స్ రేసులో మెరుగైన అవకాశాలుండేవి.